హిమాలయాల్లో అగ్నికీలలు.. మానవ తప్పిదాలతో పెరుగుతున్న వైపరీత్యాలు
అత్యంత తీవ్రత గల తుఫాన్లు, వరదలు, వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన వేడి గాలులు, అగ్ని పర్వతాల విస్ఫోటనం.. ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణిస్తూ ఉంటాం. సాధారణంగా వైపరీత్యాలకు భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణమైనప్పటికీ.. ఈ మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ వైపరీత్యాలు విరుచుకుపడుతున్నాయి. ఇందుకు మానవ తప్పిదాలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అత్యంత తీవ్రత గల తుఫాన్లు, వరదలు, వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన వేడి గాలులు, అగ్ని పర్వతాల విస్ఫోటనం.. ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణిస్తూ ఉంటాం. సాధారణంగా వైపరీత్యాలకు భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణమైనప్పటికీ.. ఈ మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ వైపరీత్యాలు విరుచుకుపడుతున్నాయి. ఇందుకు మానవ తప్పిదాలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న భూతాపానికి భూమ్మీద మానవ సమాజం చేస్తున్న తప్పిదాలే కారణమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వైపరీత్యాల జాబితాలోకి అడవుల్లో మంటలు చేరింది. పచ్చని అడవులను దహించుకుపోతున్న దావాగ్ని ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణమండలపు అడవుల్లో చెట్టు చెట్టు రాసుకోవడం వంటి ఘర్షణ కారణంగా నిప్పు రవ్వ ఏర్పడి, అది కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అలాంటి దావానలం చెలరేగింది. పచ్చని అడవులు, ఆపై హిమగిరులు, వాటి మధ్యగా ప్రవహించే హిమానీ నదాలు, నదులు, ఉప నదులతో ‘దేవభూమి’గా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎగసిపడుతున్న మంటలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శరవేగంగా విస్తరిస్తూ నైనితాల్ జిల్లా కేంద్రాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ కార్చిచ్చును నియంత్రించేందుకు 41 మందితో కూడిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం మంటలు ఆర్పేందుకు శ్రమిస్తోంది. రక్షణశాఖలో ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలీకాప్టర్లను ఉపయోగించి నీటిని ఆకాశం నుంచి వెదజల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తోంది. భీమ్‌తాల్ సరస్సులో ఉన్న నీటిని సేకరించి, ఆ నీటిని వెదజల్లుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ సిబ్బంది సెలవులన్నింటినీ రద్దు చేసింది. అందరినీ విధులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించింది. గత కొద్ది నెలలుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ తరహా మంటలను ఎదుర్కొంటోంది. వాతావరణంలో పెరుగుతున్న వేడి (భూతాపం) ఈ తరహా మంటలకు కారణమని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలే మనిషి అత్యాశకు అడవులు బలైపోతుంటే.. ఆ కారణంగా పెరిగిన భూతాపం మిగిలిన అడవులను మరింత మింగేస్తోంది. గత శతాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కార్చిచ్చు ఘటనలను ఓసారి పరిశీలిస్తే..
2003లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో సంభవించిన సైబీరియన్ తైగా ఫైర్స్ చరిత్రలోనే నమోదైన అతి పెద్ద కార్చిచ్చు. ఏకంగా 55 మిలియన్ ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతైపోయింది. దట్టమైన మంచుతో, అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఉండే ఈ ప్రాంతంలో సంభవించిన మంటలు మానవాళికే సవాలు విసిరాయి. తూర్పు సైబీరియా, ఉత్తర మంగోలియా, ఈశాన్య చైనా ప్రాంతాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో తరచుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. గ్లోబల్ ఫైర్ మానిటరింగ్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కార్చిచ్చు ఘటనలను రికార్డు చేస్తోంది. దీని తర్వాత ఆస్ట్రేలియాలో పొదలతో కూడిన అడవుల్లో చోటుచేసుకున్న మంటలు రెండవ అతి పెద్దది దావాగ్ని. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్, సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రాల్లోని మొత్తం 42 మిలియన్ ఎకరాల్లోని తుప్పలు, పొదలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 2019-20 సంవత్సరాల్లో సంభవించిన ఈ మంటలకు కారణం అత్యధిక వేడి, పొడి వాతావరణమేనని నిపుణులు తేల్చారు. 2019 జూన్‌లో ప్రారంభమైన ఈ మంటలు, 2020 మే వరకు.. అంటే దాదాపు ఏడాది కాలం కొనసాగాయి. 2019 డిసెంబర్ నెలలో భారీ ఎత్తున మంటలు ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ కార్చిచ్చులో కేవలం తుప్పలు, పొదలు మాత్రమే కాదు, భవంతులు, గృహాలు కూడా కాలి బూడదవ్వగా, 3 బిలియన్ల జంతుజాలం సజీవంగా దహనమైపోయింది.
ఈ ఘటనల తర్వాతి స్థానాల్లో 2014లో కెనడాలో చోటుచేసుకున్న నార్త్‌వెస్ట్ టెర్రిటరీస్ ఫైర్ (8.5 మిలియన్ ఎకరాలు), 2004లో అలాస్కా (అమెరికా)లోని 6.6 మిలియన్ ఎకరాల అడవిని మింగేసిన కార్చిచ్చు ఘటనలు నిలిచాయి. కెనడాలో 1919లో 5 మిలియన్ ఎకరాలను బూడిదగా మార్చేసిన కార్చిచ్చు ఘటన కూడా పెద్దదే. ‘ది గ్రేట్ ఫైర్ ఆఫ్ 1919’గా ఇది చరిత్ర పేజీల్లో నమోదైంది. ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో చోటుచేసుకుంటున్న మంటలు సైతం ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ తరహా విపత్తులు మానవాళికే కాదు, భూగోళంపై జీవించే చరాచర జీవరాశి ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వైపరీత్యాలు మరిన్ని జరగకుండా ఉండాలంటే.. మానవ సమాజం ఇకనైనా మేల్కొనక తప్పదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..