సీఎం కావాలంటే 500 కోట్ల సూట్‌కేస్ ఉండాల్సిందే.. సిద్ధూ భార్యను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ
పంజాబ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే "సూట్‌కేస్‌లో రూ. 500 కోట్లు ఉండాల్సిందేనని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం అమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

పంజాబ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే “సూట్‌కేస్‌లో రూ. 500 కోట్లు ఉండాల్సిందేనని ఆమె మాట్టాడడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలను అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు ఆయుధంగా మలచుకున్నాయి. ఆమె వ్యాఖ్యలనపై బీజేపీ నాయకుడు సుధాంశు త్రివేది స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో “పాతుకుపోయిన అవినీతిని” బహిర్గతం చేశాయని అన్నారు.
అయితే తన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో సోమవారం ఉదయం నవజ్యోత్ కౌర్ తన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ తమను డబ్బు డిమాండ్ చేసిందని అనలేదని.. తన మాటలను కావాలనే వక్రకరించి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి అవుతారా అని ఇతర పార్టీల వాళ్లు అడిగినప్పుడు.. మాకు సీఎం పదవికి కావాల్సినంత డబ్బు లేదు.. మా దగ్గర 500 కోట్ల సూట్‌కేస్ లేదు’ అని తాను జవాబు ఇచ్చానని చెప్పింది. దయచేసి తన వ్యాఖ్యలను పూర్తిగా వినండని పేర్కొంది.
ఇదిలా ఉండగా కౌర్ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. తన ఉద్దేశం పార్టీ మమ్మల్ని డబ్బులు అడిగిందని చెప్పడం కాదని చెప్పినా.. పార్టీ హైకమాండ్ ఆమె వైఖరితో సంతృప్తి చెందలేదు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రకటించారు. ఈ తాజా వివాదంతో పంజాబ్ కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలను మరోసారి బయటపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




