యూరప్‌ దేశాలను భయపెడుతున్న కరోనా స్వైరవిహారం

తగ్గినట్టే తగ్గి మళ్లీ స్వైరవిహారం చేస్తోంది కరోనా వైరస్‌.. అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తోంది.. మొదటిసారి కంటే రెండో దశ వ్యాప్తే ఎక్కువగా భయపెడుతోంది.. యూరప్‌ దేశాలన్నీ గజగజమని వణికిపోతున్నాయి..

యూరప్‌ దేశాలను భయపెడుతున్న కరోనా స్వైరవిహారం
Balu

|

Oct 31, 2020 | 1:16 PM

తగ్గినట్టే తగ్గి మళ్లీ స్వైరవిహారం చేస్తోంది కరోనా వైరస్‌.. అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తోంది.. మొదటిసారి కంటే రెండో దశ వ్యాప్తే ఎక్కువగా భయపెడుతోంది.. యూరప్‌ దేశాలన్నీ గజగజమని వణికిపోతున్నాయి.. అమెరికా కూడా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల భయపడిపోతోంది..మొన్న ఒక్కరోజే అమెరికాలో రికార్డు స్థాయిలో 90 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. బ్రిటన్‌లో ఇప్పటికే కరోనా నిబంధనలను కఠినతరం చేశారు.. దేశంలో లాక్‌డౌన్‌ విధించాలంటూ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌పై ఒత్తిడి వస్తోంది. మిగతా ఐరోపా దేశాలు ఫ్రాన్స్‌, బెల్జియం, ఇటలీలలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.. ఫ్రాన్స్‌లో అయితే రెండోసారి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.. అది కూడా చాలా కఠినంగా..! జర్మనీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అక్కడ కూడా లాక్‌డౌన్‌ను విధించారు కానీ.. కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. పోర్చుగల్‌, చెక్‌ రిపబ్లిక్‌లలో పిట్ట కూడా బయటకు రావడం లేదు.. ఆయా దేశాలలో కర్ఫ్యూ అమలులో ఉంది.. ఐర్లాండ్‌లోనూ అంతే.. వ్యాపార సముదాయాలన్నీ మూతబడ్డాయి.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కఠినాతికఠినంగా అమలు చేయకపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుందని అంటున్నారు. యూకే సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీస్‌ -ఎస్‌ఏజీఈ వేసిన అంచనాలకు సంబంధించిన ఓ పేపర్‌ లీక్‌ కావడంతో కఠిన వాస్తవలు వెలుగులోకి వచ్చాయి.. ఇలాగే ఉదాసీనంగా ఉంటే మాత్రం ఒక్క బ్రిటన్‌లోనే 85 వేల మందికి పైగా కరోనాతో మరణించవచ్చట! రోజుకు 800 మంది కరోనాతో కన్నుమూస్తారట! ఐసీయూలు కిటకిటలాడతాయట! రోజుకు లక్షమంది కరోనా బారినపడతారట! వినడానికే భయంగా లేదూ! కరోనా వైరస్‌ గురించి, అది చేసే హానీ గురించి తెలిసినప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ అలెర్టయ్యాయి.. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి.. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ను సడలించారో అప్పుడే దేశాలన్నీ రిలాక్స్‌ అయ్యాయి.. ఏం కాదులేనన్న నిర్లిప్తత ఆవరించింది.. జనం కూడా లాక్‌డౌన్‌తో విసిగిపోయి ఆన్‌లాక్‌తో స్వేచ్ఛ వచ్చినట్టుగా ఫీలయ్యారు.. ఇష్టం వచ్చినట్టుగా బయటతిరిగారు.. మాస్కులను దూరం పెట్టారు.. భౌతికదూరం అస్సలు పాటించలేదు.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్న సూచనను ఖాతరు చేయలేదు.. అందుకే కరోనా మళ్లీ జడలు విప్పుకుంది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu