Fish Biryani : మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే
Fish Biryani Recipe: ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ముక్కలేనిదే ముద్దదిగదు. అయితే ఎప్పుడూ తినే చికెన్, మటన్ బిర్యానీలు బోర్ కొడితే.. ఈసారి ఫిష్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో అయిపోయే ఈ స్పెషల్ ఫిష్ బిర్యానీ పెద్దలకే కాదు పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ఇంట్లోనే పర్ఫెక్ట్గా హోటల్ రుచిని తలపించేలా ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

సాధారణంగా బిర్యానీ అనగానే అందరికీ చికెన్ లేదా మటన్ బిర్యానీలే గుర్తొస్తాయి. కానీ, చికెన్ బిర్యానీ చేయడం కంటే కూడా ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేయడం చాలా సులభం, అంతే రుచికరమైనది. చేప ముక్కలు విరిగిపోతాయనే భయం లేకుండా, కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే, ఇంట్లోనే నోరూరించే ఫిష్ దమ్ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి చేప దమ్ బిర్యానీ ఇంట్లో సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఫిస్ బిర్యానీ కావలసిన పదార్థాలు
తల, తోక తీసి, మధ్య భాగం, కాస్త లావుగా కట్ చేసిన 800 గ్రాములు చేప ముక్కలు, 2.5 గ్లాసులు బాస్మతి బియ్యం, రుచికి సరిపడా ఉప్పు, కారం రుచికి సరిపడా, 2 టీస్పూన్ల ధనియాల పొడి1 టీస్పూన్ మ్యారినేషన్ కి, 1 టీస్పూన్ గ్రేవీకి, అలాగే 3 టీస్పూన్ నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ మ్యారినేషన్ కి, 2 టీస్పూన్లు రైస్ కి, చిటికెడు పసుపు, వేయించడానికి సరిపడ నూనె, బిర్యానీ దినుసులు: బిర్యానీ ఆకులు (2), జావిత్రి (1), మిరియాలు (12-15), జాజిపువ్వు , యాలకులు , బడి ఇలాచీ/నల్ల యాలకులు , మరాఠీ మొగ్గలు , లవంగాలు (5-6), దాల్చిన చెక్క (చిన్న ముక్క, షాజీరా (0.5 టీస్పూన్)
4 స్పూన్ల నెయ్యి, 2 టీస్పూన్లు రైస్ కి, 2 టేబుల్ స్పూన్లు పైన వేయడానికి, సన్నగా తరగిన ఉల్లిపాయలు ఒకటి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 గాట్లు పెట్టిన పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా ప్యూరీ, 0.5 కప్పు పెరుగు, గరం 1 టీస్పూన్ గరం మసాలా, పుదీనా ఆకులు, కొత్తిమీర ఉంటే సరిపోతుంది.
ఫిష్ బిర్యానీ తయారీ విధానం
చేపల మ్యారినేషన్: చేప ముక్కలను బాగా కడిగి నీరు లేకుండా చూసుకోవాలి. వాటికి రుచికి సరిపడా ఉప్పు, 1.5-2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ పసుపు వేసి బాగా పట్టించాలి. ఈ ముక్కలను 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి.
బియ్యం సిద్ధం చేయడం: 2.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి, బియ్యానికి డబుల్ అమౌంట్ నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. ఈ నీటిలో రెండు బిర్యానీ ఆకులు, ఒక జావిత్రి, 12-15 మిరియాలు, కొంచెం జాజిపువ్వు, మూడు యాలకులు, ఒక బడి ఇలాచీ, రెండు మరాఠీ మొగ్గలు, ఐదు-ఆరు లవంగాలు, దాల్చిన చెక్క, అర టీస్పూన్ షాజీరా, రైస్ కు సరిపడా ఉప్పు , ఒకటి రెండు టీస్పూన్ల నెయ్యి లేదా నూనె, నిమ్మ తొక్క వేసి సిద్ధంగా ఉంచాలి.
చేప ముక్కలు వేయించడం: వెడల్పుగా ఉన్న పాన్ లో ఐదు-ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వన్ బై వన్ వేసి మీడియం మంటపై నాలుగు-ఐదు నిమిషాలు క్రిస్పీగా వేయించాలి. చేపలు విరిగిపోకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. కింద వైపు బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా మరో పక్కకు తిప్పి, లో ఫ్లేమ్ లో మరో నాలుగు-ఐదు నిమిషాలు వేయించాలి. ఇలా వేయించిన ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
బిర్యానీ మసాలా తయారీ: చేపలు వేయించిన అదే నూనెను వడకట్టి, మందపాటి గిన్నెలో తీసుకోవాలి. అందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు మీడియం మంటపై వేయించాలి. కొన్ని వేయించిన ఉల్లిపాయలను పక్కకు తీసి, మిగిలిన వాటిని ఒక పక్కకు జరిపి, తక్కువ నూనె ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసి లైట్ గా వేయించాలి.
తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగైదు గాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఒక కప్పు టమాటా ప్యూరీ వేసి బాగా వేగనివ్వాలి. మరో గిన్నెలో అర కప్పు పెరుగు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, గ్రేవీకి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, వేగిన టమాటా మిశ్రమంలో వేసి కలపాలి. ఒక పిడికెడు పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి బాగా కలిపి, రుచి చూసి అవసరమైతే ఉప్పు సర్దుబాటు చేయాలి.
అన్నం ఉడికించడం: ఇక నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని సిద్ధం చేసుకున్న మసాలా నీటిలో వేసి, 80-90శాతం ఉడికే వరకు ఉడికించాలి. అన్నం మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండాలి.
లేయర్స్‌గా వేయడం
ఇప్పుడు బిర్యానీ మసాలాలో సగం తీసి పక్కన పెట్టాలి. మిగిలిన మసాలాను గిన్నె అడుగున సమానంగా పరచాలి. దానిపై వేయించిన చేప ముక్కలను వేయాలి, దానిపై కొంచెం కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు చల్లాలి. తర్వాత ఉడికించిన అన్నంలో సగం భాగాన్ని జాలిగరిటెతో తీసి చేప ముక్కల పైన వేయాలి. ఇప్పుడు పక్కన పెట్టిన మసాలాను అన్నం పైన సమానంగా పరచాలి. మిగిలిన చేప ముక్కలను, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు చల్లాలి.
చివరిగా మిగిలిన అన్నాన్ని వేసి, పైన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేయాలి. అన్నం ఉడికించిన నీటిలో నుండి రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ పైనుండి వేయాలి. ఇలా వేయడం వల్ల బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిలో చిటికెడు పసుపు కలిపి, బిర్యానీ పైనుండి, అంచుల చుట్టూ వేయాలి. ఇది మంచి రంగును ఇస్తుంది. సిల్వర్ ఫాయిల్ కవర్ తో గిన్నెను కవర్ చేసి, పైన టైట్ గా మూత పెట్టి, 7-10 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ చేయాలి.
దమ్ అయిన తర్వాత మూత తీసి, బిర్యానీని జాగ్రత్తగా సర్వ్ చేయాలి. చేప ముక్కలు విరిగిపోకుండా ఉండటానికి నెమ్మదిగా కలపాలి. పెద్ద బేసిన్ లోకి డిమోల్డ్ చేసి వడ్డిస్తే ముక్కలు విరగకుండా ఉంటాయి. ఈ పద్ధతిలో చేసిన చేప దమ్ బిర్యానీ గుమగుమలాడుతూ, కమ్మని రుచితో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వారందరికీ నచ్చే ఈ బిర్యానీని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
