Supreme Court: ‘ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..’ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19 (1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరింది.

సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దుచేస్తున్నట్లు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది. ఈ బాండ్ల కోసం IT చట్టంలోనూ, ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ తేల్చిచెప్పారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం, సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది.
ఎలక్టోరల్ బాండ్స్‌కు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటిదాకా ఈ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు కోరితే, ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అయితే దాతల వివరాలను SBI మార్చి ఆరోతేదీలోపు ఎన్నికల సంఘానికి అందించాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. దీంతోపాటే ఎన్నికల కమిషన్ మార్చి 13కల్లా, ఈ సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రకటించాలని కూడా ఈ తీర్పు చెబుతోంది. ఇక ప్రభుత్వానికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళుతున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉన్నదని చీఫ్ జస్టిస్ తన తీర్పులో వెల్లడించారు.
అలాగే, ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు విషయంలో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన వెసలుబాటుకు కూడా సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం బ్రేకులు వేసింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు గంపగుత్తగా, అపరిమితంగా విరాళాలు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం కంపెనీల చట్టాన్ని సవరించడాన్ని కూడా సుప్రీం తీప్పుబట్టింది. ఈ వెసలుబాటు వల్ల రాజకీయ పార్టీలకు, దాతలకు మధ్య క్విడ్ ప్రో కో వ్యవహారం సాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
వీటికితోపాటు, ఎలక్టోరల్ బాండ్స్ వల్ల బ్లాక్‌మనీకి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చేసిన వాదనను కూడా కొట్టిపారేసింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్‌ను ఎవరు కొనుగోలు చేశారో, ఎవరు సొమ్ము చేసుకున్నారో అన్న విషయం ప్రజలకు తెలియాలని CJI చంద్రచూడ్ చెప్పారు. ఇక ఎన్‌క్యాష్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎలక్టోరల్ బాండ్స్‌ను రిఫండ్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




