Yogi Adityanath: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దు.. మంత్రులకు యూపీ సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవొద్దంటూ సహచర మంత్రులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పనుల కేటాయింపులో జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు.

Yogi Adityanath: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దు.. మంత్రులకు యూపీ సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్
CM Yogi Adityanath (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 29, 2022 | 11:29 AM

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవొద్దంటూ సహచర మంత్రులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పనుల కేటాయింపులో జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. అత్యంత అప్రమత్తంగా మంత్రివర్గ బాధ్యతలు చేపట్టాలన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల కొందరు మంత్రులపై వచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై ఆయన స్పందించారు. మంత్రి పదవిని ప్రజలకు సేవ చేసేందుకు లభించిన గొప్ప అవకాశంగా పరిగణించాలని మంత్రులకు యోగీ సూచించారు. మంత్రులు తమ సమయాన్ని పూర్తిగా రాష్ట్ర రాజధాని లక్నోలోనే వెచ్చించొద్దన్నారు. ప్రతి వారం మూడు నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో ఉంటూ తమ శాఖల పనుల్లో పురోగతిని సమీక్షించాలని సూచించారు. తమ శాఖల్లో కొత్త ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టిసారించాలని హితవుపలికారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. ఒకే రకమైన ఆలోచనతో ముందుకెళ్తే తమ శాఖలకు సంబంధించి చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ సాధించలేరన్నారు. శాఖల వారీగా చేపడుతున్న పనుల్లో పురోగతిని మంత్రుల వద్ద యోగీ అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వీలైనంతగా టెక్నాలజీ వినియోగానికి వీలు కల్పించడంపై దృష్టిసారించాలన్నారు. ప్రకృతి వైద్యం కోసం ప్రజలు యూపీ నుంచి బెంగుళూరుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని.. యూపీలోనే ఈ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయుష్ మంత్రిని సీఎం యోగి ఆదేశించారు.

ప్రభుత్వం చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని.. మొక్కలు నాటడంతో చేతులు దులుపుకోకుండా వాటిని సంరక్షించడంపై కూడా ప్రత్యేక దృష్టిసారించాలని వాతావరణ శాఖకు ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి