కానిస్టేబుల్‌ను కారుతో ఢీ కొట్టి, పది మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు.. చికిత్సపొందుతూ మృతి!
శనివారం(సెప్టెంబర్ 28) రాత్రే మద్యం స్మగ్లర్లు నంగ్లోయ్‌లోని చెక్‌పాయింట్‌లో పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో ఢీ కొట్టారు. అంతే కాకుండా 10 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. అక్రమార్కులు, మద్యం స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. పోలీసులను కూడా వదలడం లేదన్నంతగా పెరిగిపోయింది. శనివారం(సెప్టెంబర్ 28) రాత్రే మద్యం స్మగ్లర్లు నంగ్లోయ్‌లోని చెక్‌పాయింట్‌లో పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో ఢీ కొట్టారు. అంతే కాకుండా 10 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో ఉన్న ఇతర పోలీసులు అతన్ని ఆసుపత్రికి చేర్చారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం స్మగ్లర్లు కారులో పెద్ద మొత్తంలో సరుకుతో నాంగ్లోయ్ ప్రాంతం నుంచి వెళ్తున్నట్లు ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందింది. ఈ సమాచారంతో పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. ఇంతలో, చెక్‌పాయింట్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు అనుమానాస్పదంగా ఉన్న కారు కనిపించింది. అతను కారు డ్రైవర్‌ను ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే కారు డ్రైవర్ వేగం మరింత పెంచాడు. కానిస్టేబుల్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించే ముందు, కారు డ్రైవర్ అతన్ని ఢీకొట్టాడు. అనంతరం అదే వేగంతో కానిస్టేబుల్‌ను 10 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోయాడు. కారు డ్రైవర్ కారును ఫుల్ స్పీడ్‌గా నడిపి చాలా దూరం వరకు నడిపి అక్కడి నుంచి కారును వదిలి పరారయ్యాడు. ఆదివారం(సెప్టెంబర్ 29) తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..