Delhi: 75 ఏళ్ల నాటి కారు కోసం యజమాని పోరాటం.. ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ..!

Delhi News: 75 ఏళ్ల నాటి తన పాత కారును గ్యారేజీ నుంచి అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దీనిపై పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఢిల్లీ ప్రభుత్వం స్పందనను కోరింది. 1948 మోడల్ హంబర్ కారు తన తాతకి చెందినదని, ఇది తన జ్ఞాపకమని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Delhi: 75 ఏళ్ల నాటి కారు కోసం యజమాని పోరాటం.. ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ..!
Delhi High Court
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2023 | 12:37 PM

న్యూ ఢిల్లీ, జులై 20: 75 ఏళ్ల నాటి తన పాత కారును గ్యారేజీ నుంచి అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దీనిపై పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఢిల్లీ ప్రభుత్వం స్పందనను కోరింది. 1948 మోడల్ హంబర్ కారు తన తాతకి చెందినదని, ఇది తన జ్ఞాపకమని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది నిరుపయోగంగా ఉందని, చట్ట ప్రకారం పాతకాలపు కారుగా నమోదు చేసుకోవడానికి మరమ్మతుల కోసం గ్యారేజీకి పంపించానని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్.. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. దీనికి సమాధానం చెప్పాలంటూ గడువు ఇచ్చారు. అంతేకాదు.. ఈలోగా వాహనాన్ని స్క్రాప్ చేయొద్దని కూడా అధికారులను ఆదేశించింది న్యాయస్థానం.

పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రితీస్ సబర్వాల్ వాదిస్తూ.. గత నెలలో కారును ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారని, సీజ్ మెమోలో కనీసం వాహనానికి సంబంధించిన వివరాలను కూడా సరిగా నమోదు చేయలేదని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనం 1961 అంబాసిడర్ అని అధికారులు పేర్కొన్నారని, కానీ, వాస్తవానికి అది 1948 మోడల్ హంబర్ కారు అని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కాగా, 15 ఏళ్లు పెట్రోల్, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాల వినియోగాన్ని నిషేధిస్తూ ఎన్‌జీటీ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పిటిషనర్ నడుచుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది. ఆ వాహనాన్ని రోడ్డుపై నడపడం లేదని, గ్యారేజీకే పరిమితమైందని పేర్కొన్నారు. ‘పిటిషనర్ మోటారు వెహికల్ యాక్ట్ – 1988 ప్రకారం తన వాహనాన్ని పాతకాలపు కారుగా రీ-రిజిస్ట్రేషను చేసే ప్రక్రియలో ఉన్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కారును తిరిగి ఇప్పించండి.’ అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కారు కుటుంబ వారసత్వంగా వస్తోంది. నా తాతకు చెందినది. ఈ కారుకు, మా కుటుంబానికి బావోద్వేగ సంబంధం ఉంది. కుటుంబ విలువల కొనసాగింపును నిర్ధారించడానికి కారును రక్షించండి.’ అని పిటిషనర్ అభ్యర్థించారు. అధికారుల చర్య భారత రాజ్యాంగం ప్రకారం తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..