Corona Cases: దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ ‘ఆ’ రాష్ట్రంలో మాత్రం భిన్నం..మళ్ళీ కరోనా విజృంభణ.. లాక్‌డౌన్ తప్పదా?
దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంటే ఆ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి రివర్స్ గేర్‌లో నడుస్తోంది. జనవరిలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. తాజాగా మళ్ళీ...
Coronavirus cases raising again: దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంటే ‘ఆ’ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి రివర్స్ గేర్‌లో నడుస్తోంది. జనవరిలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. తాజాగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా మళ్ళీ లాక్ డౌన్ విధిస్తామని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇంతకీ దేశంలో కరోనా తగ్గుతుంటే ‘ఆ’ రాష్ట్రంలో మాత్రం ఎందుకు కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి? ఇదిపుడు హాట్ టాపిక్‌గా మారింది.
దేశంలో రోజు వారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు పది వేలకు లోపే రోజూవారీ కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా మళ్ళీ దేశంలో కరోనా కేసులు పదివేల అంకెను దాటేస్తూ మళ్ళీ కలవరం రేపుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ మధ్య 11 వేల మార్కును దాటేశాయి కరోనా కేసులు. అయితే.. ఇందులో ఏకంగా నాలుగు వేల కేసులు ఒక్క మహారాష్ట్రాలోనే నమోదవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం. దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకలా వుంటే.. మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కొన్ని రాష్ట్రాల్లో రోజు 100 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో పాజిటివ్ కేసులే లేవు. ఇది ఊరట కలిగించే విషయం. అయితే, కరోనా వ్యాపించడం మొదలైన నాటి నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఒకదశలో ప్రతిరోజు 20వేలకు పైగా పాజిటివ్ కేసులు చూసిన మహారాష్ట్రలో ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఇది ప్రభుత్వాలను కలవరపరుస్తోంది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్‌డౌన్ విధిస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి తలెత్తింది?
దేశంలో కరోనా మహమ్మారి పీక్ లెవల్లో వున్న సందర్భంలో మహారాష్ట్రలో రోజుకు అత్యధికంగా 22 నుంచి 23 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మృతుల సంఖ్య కూడా ఆదే స్థాయిలో వుండింది. కేసులు, మరణాల పరంగా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది మహారాష్ట్ర. ఇవన్నీ చూసిన వారికి ఆ రాష్ట్రం తిరిగి కోలుకుంటుందా? అన్న అనుమానం కలిగింది. అలాంటిది జనవరి నెలలో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జనవరిలో కేవలం 2 వేల నుంచి 2500 కేసులు మాత్రమే నమోదవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత వారం రోజులుగా మహారాష్ట్రలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరోసారి 3వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 14న) ఒక్కరోజే 4 వేల కేసులు నమోదవడంతో మరోసారి ఆందోళన మొదలైంది. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్న వేళ మరాఠా రాజ్యంలో మళ్లీ కేసుల గ్రాఫ్ పైకి లేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంతో పోలిస్తే ఫిబ్రవరి రెండో వారంలో కేసులు క్రమంగా పెరుగుతుండడం కలకలం రేకెత్తిస్తోంది.
కేసుల పెరుగుదలకు కారణమిదే!
మహారాష్ట్ర రాజధాని ముంబయి సహా విదర్భ ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. చాలా రోజులుగా నిలిచిపోయిన లోకల్ రైళ్లకు అనుమతివ్వడం ముంబయి ప్రాంతంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంఛనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మరో కారణమని తెలుస్తోంది. సతారా జిల్లాలోని ఓ గ్రామ జనాభా 1900 కాగా.. ఆ ఒక్క గ్రామంలోనే ఒకేరోజు 62 కేసులు నమోదయ్యాయి. దీనిబట్టి కోవిడ్-19 మనల్ని వీడి వెళ్లిపోయిందన్న అపోహతో ప్రజలంతా ఒక దగ్గర పోగవుతున్నారని అర్థమవుతోందని అధికారులు అంటున్నారు. పైగా కోవిడ్ కారణంగా వాయిదా పడిన శుభకార్యాలన్నీ ఇప్పుడు నిర్వహిస్తుండడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వంటివి మళ్ళీ కరోనా విజృంభణకు కారణాలుగా అధికార యంత్రాంగం అంఛనా వేస్తోంది.
ధారావి లాంటి అతిపెద్ద మురికివాడల్లో లక్షలాది మంది ప్రజలు నివసించే ముంబయి మహానగరంలో జనసాంద్రత మన దేశంలోనే అత్యధికం. అలాంటి మహానగరంలో లోకల్ రైళ్ళలో జనం కిక్కిరిసి ప్రయాణించడం సర్వసాధారణ విషయం. దానికి తోడు ధారావి, కామాటిపుర వంటి మురికివాడల్లో కడు పేదరికంలో వుంటే ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం చాలా దుర్లభం. మొన్నటి వరకు కఠినంగా వ్యవహరించిన అధికార యంత్రాంగంలోను అలసత్వం రావడం, ప్రజల్లో కోవిడ్ తగ్గిపోయిందన్న భావన పెరిగిపోవడంతో ప్రజలు సాధారణ జీవనాన్ని దాదాపు ప్రారంభించారు. ఇదే మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరగడానికి కారణమని తెలుస్తోంది.
రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై మహరాష్ట్రలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దేశించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాన్ని కోరింది. లేకపోతే మళ్ళీ లాక్ డౌన్ వంటి తిప్పలు తప్పవని హెచ్చరించింది. దాంతో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని హెచ్చరించారు. లాక్‌డౌన్ కావాలో, వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే అన్నారు. అవసరమైతే స్కూళ్లు మూసివేయాలని అధికారులకు సూచించామన్నారు. తొలినాళ్లతో పోలిస్తే కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం పెద్దగా అమలవ్వడం లేదని, టెస్టులు సంఖ్య కూడా తగ్గడం వ్యాప్తి పెరుగుదలకు కారణమవుతోందని ఆ రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్ అవతే అంగీకరించారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ పరిస్థితి చేయిదాటిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారి తెలిపారు.
Also Read: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా? టీకా మెరుగ్గా పని చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..