AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కాంగ్రెస్ గాడిలో పడాలంటే అలా చేయాల్సిందే.. పార్టీ పెద్దలకు ఆనంద్ శర్మ కీలక సూచన

రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపెడుతుండటం కూడా క్యాడర్ పై ప్రభావం చూపుతోంది. అయితే.. పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టకపోతే

Congress: కాంగ్రెస్ గాడిలో పడాలంటే అలా చేయాల్సిందే.. పార్టీ పెద్దలకు ఆనంద్ శర్మ కీలక సూచన
Congress
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 12:55 PM

Share

Anand Sharma Comments: 2014 నుంచి.. ఘోర పరాజయాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయడం, పలు రాష్ట్రాల్లో వరుస ఓటములు, గ్రూప్ 7 నేతల అసంతృప్తి, పలువురు నేతల రాజీనామాలు.. ఇలా ఎన్నో అంశాలు పార్టీ క్యాడర్‌ను తీవ్ర అంతర్మథనంలోకి నెట్టాయి. బీజేపీ ప్రభంజనానికి.. కాంగ్రెస్ చెక్ పెట్టగులుగుతుందా..? పార్టీ పునరుజ్జీవం సాధించి మళ్లీ అధికారాన్ని చేపడుతుందా..? పార్టీ బలోపేతం ఎలా ? సోనియా గాంధీ తర్వాత.. పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడు ఎవరు..? ఇలా ఎన్నో ప్రశ్నలు క్యాడర్‌ను అయోమయంలో పడేశాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపెడుతుండటం కూడా క్యాడర్ పై ప్రభావం చూపుతోంది. అయితే.. పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టకపోతే గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ చీఫ్ అవుతారని ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగా సోనియా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌తో కూడా చర్చలు జరిపారని జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య పార్టీ అగ్రనేతల్లో, శ్రేణుల్లో కాంగ్రెస్ పునర్‌వైభవంపై విస్తృత చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం అవసరమని, సమిష్టి కృషితో ఇది సాధ్యమవుతుందంటూ ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సిమ్లాలో పర్యటించిన ఆనంద్ శర్మ.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. పార్టీ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సొంత రాష్ట్రంలో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి పునర్వైభవం అవసరమని, సమష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

“మేము కొన్ని సమస్యలను తీసుకున్నాము.. ఈ సమస్యలను గతంలో చాలా సమావేశాలలో వివరంగా చర్చించాము. చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి.. కొన్ని కాలేదు.. మేము కొన్ని అంతర్గత మార్పులు, పునరుద్ధరణలు, పునర్‌నిర్మాణం గురించి తీసుకువస్తే.. మంచిదని ఆశిస్తున్నాము. వీటితో కాంగ్రెస్ పునరుజ్జీవనం ఖాయం’’ అని శర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి

పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలికి రాసిన లేఖలో అన్ని సవివరంగా చెప్పానని.. తన సూచించిన అంశాలపై ప్రస్తావన వస్తుందని ఆశిస్తున్నానన్నారు. “ఏదైనా సంస్థలో లేదా కుటుంబంలో మీరు సూచనలు, ప్రతిపాదనలు చేసినట్లుగానే కాంగ్రెస్‌లో మేము కొన్ని సూచనలు చేస్తాము. ఇది కాంగ్రెస్ కుటుంబం,” అంటూ అభిప్రాయపడ్డారు.

సమిష్టి ప్రణాళికలతోనే..

‘ఎ’ గ్రూపు లేదా ‘బి’ గ్రూపు కాంగ్రెస్‌ను పునరుజ్జీవం చేయడం సాధ్యం కాదని, కాంగ్రెస్‌ను సమిష్టిగా పునరుజ్జీవం చెందేలా ప్రణాళికలు రూపొందిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. పార్టీలో సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని.. ప్రస్తుత పరిణామాలతో తాము నిజంగానే ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత మార్పులు, సంస్కరణలు అవసరమంటూ శర్మ మరోసారి సూటిగా చెప్పారు.

హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు..? అన్న మీడియా ప్రశ్నకు శర్మ మాట్లాడుతూ.. ముందుగా సమిష్టి కృషితో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సమూహాలు, అసంతృప్తులను పక్కన పెట్టాలన్నారు. మొదట పార్టీ గెలవాలి.. దీనికోసం అందరూ సమష్టిగా పోరాడాలి. పార్టీలో ఆయన పాత్రపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తానెప్పుడూ పార్టీలో ఎలాంటి పదవిని డిమాండ్ చేయలేదు, అడగలేదన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ..

2024 ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ.. అని పేర్కొన్న మనీష్ సిసోడియా వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. కలలు కనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. వారికి కూడా ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో మొత్తం దేశానికి సంబంధించిన సమస్యలు దాదాపుగా ఉంటాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇలాంటివి ఉంటాయన్నారు. అంతర్గత పోరు కాంగ్రెస్‌లోనే కాదు, బీజేపీలో కూడా ఎక్కువగా ఉందని శర్మ వ్యాఖ్యానించారు.

సిద్ధాంతాలను నిలబెట్టుకోవడం.. పార్టీలో పరిస్థితులు మారడానికి సమయం పడుతుందన్న ఆయన.. గ్రూపుల నుంచి బయటపడి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంద్నారు. ఏఐసీసీ కొత్త చీఫ్‌గా ప్రియాంక, రాహుల్‌గాంధీ ఎన్నిక కావడాన్ని తాను లేదా ఇతర సీనియర్ నేతలు అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. 2018లో రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం.. కానీ ఆయనే రాజీనామా చేశారు. రాజీనామా చేయడం.. నెహ్రూ-గాంధీ కుటుంబం అంతర్భాగంగా ఉండడం ముఖ్యం.. అంటూ ఆనంద్ శర్మ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..