ED Raids: ప్లీనరీ వేళ రాయ్‌పూర్‌లో ఈడీ దాడులు.. బొగ్గు మైనింగ్ స్కామ్‌లో కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు..
మైనింగ్ స్కాంలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఎం భూపేష్ బఘేల్ సన్నిహితుల ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల వేళ చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈడీ దాడులపై తీవ్ర దుమారం చెలరేగింది. మైనింగ్ స్కాంలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఎం భూపేష్ బఘేల్ సన్నిహితుల ఇళ్లలో దాడులు జరుగుతున్నాయి. భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ సుశీల్ సన్నీ అగర్వాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ నివాసాలతోసహా 10కిపైగా ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సీఎం నివాసం పక్కనే ఉన్న నేతల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేయడం తీవ్ర సంచలనం రేపింది.
మరో నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 24- 26 మధ్య కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ప్లీనరీ సమావేశాలను అడ్డుకునే కుట్రలో భాగంగా బీజేపీ ఈడీ సోదాలు చేయిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. 2024 ఎంతో దూరంలో లేదని , ఈ దాడులు చేస్తున్న అధికారులు తగిన శిక్ష అనుభవిస్తారని కాంగ్రెస్ ఘాటుగా హెచ్చరించింది. ఎన్నో షెల్ కంపెనీలు నడుపుతున్న మాజీ సీఎం , బీజేపీ నేత రమణ్‌సింగ్ ఇంటిపై ఎందుకు ఈడీ దాడులు చేయడం లేదని ప్రశ్నించారు సీఎం భూపేష్ బఘేల్. రమణ్‌సింగ్ డైరెక్షన్ లోనే ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గడిచిన రెండేళ్లలో రూ.450 కోట్ల మేరకు భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది. ఈ కుంభకోణంలో బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్, సూర్యకాంత్ తివారీ, బొగ్గు వ్యాపారవేత్త సునీల్ అగర్వాల్‌సహా తొమ్మిది మందిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. వారి ఆస్తులనూ అటాచ్ చేసింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం




