Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP vs YCP: ఏపీలో పోస్టర్ రాజకీయం.. వైసీపీ సోషల్‌ మీడియా పోస్టుపై బీజేపీ మండిపాటు..

ఏపీలో పోస్టర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తెరపైకి వచ్చింది. దేవుడిని కించపరిచారు.. మనోభావాలు దెబ్బతీశారు.. అపచారం జరిగిందని కమలం పార్టీ ఆరోపిస్తుంటే.. మీకు వేరే పనేం లేదా అంటూ మండిపడుతోంది అధికారపక్షం.

BJP vs YCP: ఏపీలో పోస్టర్ రాజకీయం.. వైసీపీ సోషల్‌ మీడియా పోస్టుపై బీజేపీ మండిపాటు..
AP BJP
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 20, 2023 | 11:08 AM

రాజకీయానికి కాదేదీ అనర్హం.. గల్లీలో జరిగే చిన్న పాటి గొడవ దగ్గర నుంచి సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ వరకు.. చిన్న అవకాశం దొరికితే చాలు.. రాజకీయం రంకెలేస్తుంది. అదే కోవలో ఇప్పుడు ఏపీని పోస్టర్ పాలిటిక్స్‌ అంటుకున్నాయి. ఈ పోస్టర్ చూడండి.. శివుని వేషంలో ఉన్న ఓ బాలునికి.. సీఎం జగన్ పాలు తాగిస్తున్నట్టుగా ఉంది కదా. వైసీపీ ట్విట్టర్‌‌లో ఈ పోస్ట్ ప్రత్యక్షమైంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అభిమానులు ఈ పోస్ట్‌ మీద తెగ లైక్‌లు కొట్టడమే కాకుండా షేర్ కూడా చేశారు. ఈ పోస్ట్‌తో వెబ్ దునియాలో తెగ తిరిగేసిన ట్విట్టర్ పిట్ట.. బీజేపీ వాళ్ల గూటిలోనూ వాలింది. ఇంకే ముంది ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఒకటే గగ్గోలు పెడుతోంది బీజేపీ పార్టీ. హిందువులతో పాటు శివభక్తుల మనోభావలను దెబ్బ తీసేలా ఈ పోస్టర్ ఉందంటూ ఆరోపణలు మొదలు పెట్టింది.

వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీని డిమాండ్ చేస్తోంది కమలం పార్టీ. లేని పక్షంలో దీనికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. వైసీపీ సర్కారు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని.. అవసరమైతే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామంటూ హెచ్చరించారు సోము వీర్రాజు.

బీజేపీ నేతలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దేవుళ్లను కించపరిచేలా అందులో ఏముందో చెప్పాలన్నారు. వాళ్ల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్‌‍ మీట్లు పెడుతున్నారు. వైసీపీ సోషల్‌ మీడియా పోస్టులో ఎలాంటి అభ్యంతరకర ఫొటో లేదన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ. ఇందులో హిందూ ధర్మానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.

మోదీ, చంద్రబాబు, పవన్‌ ఫ్లెక్సీలు, సోషల్‌ మీడియా పోస్టులను మాజీ మంత్రి అనిల్ పోస్ట్ చేశారు. ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు వైసీపీ పోస్టులో తప్పుగా ఏం కనిపించింది వీర్రాజు గారు? అంటూ ప్రశ్నించారు. జగనన్న ఫోటోలో పిల్లాడికి పాలు తాగించారు కానీ శివుడికి తాగించినట్లు లేదు కదా?? అన్నారు. ప్రతీదీ రాజకీయం చేస్తే ఎప్పటిలాగే డిపాజిట్లు కూడా రావు సార్ అంటూ ఘాటుగా స్పందించారు.

ఇదీ వరస.. క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం తప్పదని బీజేపీ.. అందులో తప్పేముందంటూ వైసీపీ.. వీళ్లిద్దరి మధ్య మొదలైన ఈ రాజకీయ రగడ ఎంత దూరం వెళ్తుందో మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం