SBI ATM Robbery: చెన్నైలో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ ఏటీఎంల చోరీ కేసు.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
SBI ATM Robbery: తమిళనాడులో సంచలన సృష్టించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంల వరుస దొంగతనాలు సంచలన సృష్టించిన విషయం తెలిసిందే...
SBI ATM Robbery: తమిళనాడులో సంచలన సృష్టించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంల వరుస దొంగతనాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వరుస దొంగతనాలకు పాల్పడిన మరో నిందితుడిని చెన్నై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాయి. గత వారం వేలాచేరి, తారామణి, విరుగంబక్కం వద్ద ఉన్న ఏటీఎం నుంచి నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈ చోరీలకు పాల్పడుతున్నది ఒక ముఠా పనే అని పోలీసులు గుర్తించారు. జూన్ 23న హర్యానాలో ముఠాలో సభ్యుడైన అమీర్‌హర్ష్‌ను పోలీసులు అరెస్టు చేసి చెన్నైకి తీసుకువచ్చారు. హర్యానాకు చెందిన మరో 9 మంది ముఠా సభ్యులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. టీ నగర్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం హర్యానాకు వెళ్లి స్థానిక పోలీసుల సహాయంతో వీరేంద్ర రావత్‌ను అరెస్టు చేసింది. ఈ ముఠా కృష్ణగిరి, కాంచీపురం, తిరువన్నమలై, వెల్లూరులో ఇలాంటి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
చోరీ ఎలా చేశారంటే..
అయితే ఏటీఎం మెషిన్లోని చిన్న లూప్‌హోల్‌ను ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దోచేశారు ఈ దొంగలు. సుమారు రూ.48 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది. అయితే స్మార్ట్‌గా లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు .. క్యాష్డిపాజిట్మెషిన్లలో డిపాజిట్‌తో పాటు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎస్బీఐ మెషిన్‌లను జపాన్ ఓకేఐ కంపెనీ తయారు చేసింది. దీనిలో విత్‌డ్రా చేసుకున్నప్పుడు 20 సెకన్లు కీలకమైన సమయంగా పరిగణిస్తారు. డబ్బులు బయటకు రాగానే 20 సెకన్లలోగా తీసుకోవల్సి ఉంటుంది. లేదంటే ఆ నోట్లను మెషిన్ లోపలికి తీసేసుకుంటుంది. వెంటనే మూత పడిపోతుంది. డబ్బులు తీసుకోలేదని అక్కడ ఉన్న సెన్సార్లు గ్రహించి సమాచారం పంపిస్తాయి. అకౌంట్లో బ్యాలెన్స్అలాగే ఉంటుంది. డబ్బులు డ్రా చేసుకునేప్పుడు ఏటీఎం మూతపడిపోకుండా చేతితో ఆపితే డబ్బులు తీసుకోలేదని సెన్సార్లు గ్రహిస్తాయి. ఎస్బీఐ ఏటీఎం మెషిన్లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని హర్యానాకు చెందిన ఈ దొంగల మూఠా చోరీలకు పాల్పడింది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని మూతపడిపోకుండా చేతితో ఆపే టెక్నిక్‌ను గ్రహించారు.
దీంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని సెన్సార్లు గ్రహించాయి. అకౌంట్లలో బ్యాలెన్స్తప్పుగా చూపించగా.. బ్యాంకు అధికారులు సీసీ టీవీలను గమనించారు. దీంతో అసలు మోసం బయటపడింది. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో జూన్15 నుంచి 18 మధ్య తమ ఎస్బీఐ ఏటీఎంలలో రూ.48 లక్షలు డబ్బును మాయం చేశారని గుర్తించారు. దీనికి సంబంధించి 14 కేసులు వచ్చాయి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఆధారంగా నిందితులు హర్యానాకు చెందిన ముఠాగా గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఇందులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.