Call Money : అనంతలో కాల్‌మనీ కోరల్లో చిక్కుకుని మరో బాధితుడు బలి, దిక్కులేనిదైన కుటుంబం
అనంతలో కాల్‌మనీ కోరలకు మరొకరు బలయ్యారు. చేసిన అప్పుకి మూడింతల అసలు చెల్లించినా.. కాల్‌మనీ గ్యాంగ్ టార్చర్ ఆగలేదు. వడ్డీలు చెల్లించాల్సిందేనని వేధించారు...
Call Money : అనంతలో కాల్‌మనీ కోరలకు మరొకరు బలయ్యారు. చేసిన అప్పుకి మూడింతల అసలు చెల్లించినా.. కాల్‌మనీ గ్యాంగ్ టార్చర్ ఆగలేదు. వడ్డీలు చెల్లించాల్సిందేనని వేధించారు. వేధింపులు తట్టుకోలేక నజీర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉండే వ్యక్తి చనిపోవడంతో నలుగురు పిల్లలున్న ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళితే, గుంతకల్లుకు చెందిన నజీర్ భవన నిర్మాణ కార్మికుడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు. రోజువారీ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
అయితే, రెండేళ్లుగా కరోనా కారణంగా పనుల్లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది దీంతో కొంత అప్పు చేశాడు. మొదట్లో వడ్డీలు సక్రమంగానే చెల్లించారు. అయితే చేసేందుకు పని లేకపోవడంతో వడ్డీ చెల్లించలేకపోయాడు. దీంతో కాల్ మనీగాళ్లు నజీర్ కుటుంబ సభ్యులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లోంచి బయటకు పిలిపించి కొడతామని బెదిరించారు. అమర్యాదగా మాట్లాడుతూ మానసికంగా వేధించారు.
వడ్డీ రాక్షసుల వేధింపులు భరించలేక నజీర్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన అంతా వ్యక్తం చేశాడు నజీర్. నజీర్ సూసైడ్‌తో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నలుగురూ చిన్నపిల్లలే కావడం.. వాళ్లు పడుతున్న బాధ స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను ఆదుకోవాలని నజీర్ కుటుంబం వేడుకుంటోంది. కాల్‌మనీ రాక్షసుల నుంచి కాపాడాలని కోరుకుంటోంది.
Read also : Anantapur : అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడని సొంత కొడుకుని ఆ తల్లి ఏం చేసిందంటే..!