ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ కి కేంద్రం నుంచి సమన్లు.. ఎందుకంటే ..?
ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ కి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇన్ కమ్ టాక్స్ పోర్టల్ లో తరచూ అంతరాయాలు కలుగుతుండడంతో.. దీన్ని కేంద్రం సీరియస్ గా పరిగణించింది.
ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ కి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇన్ కమ్ టాక్స్ పోర్టల్ లో తరచూ అంతరాయాలు కలుగుతుండడంతో.. దీన్ని కేంద్రం సీరియస్ గా పరిగణించింది. ఈ నెల 21 నుంచి ఇలా జరుగుతోందని, ఇందుకు కారణాలేమిటని ఈ సమన్లలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రశ్నించారు. ఎప్పుడు పోర్టల్ ఓపెన్ చేసినా అందుబాటులో లేదని సమాచారం వస్తోందని, ఇదేమైనా సాంకేతిక సమస్యా అని ఆమె తెలుసుకోగోరారు. జూన్ 7 న ఈ పోర్టల్ ను ప్రారంభించారు. అప్పటి నుంచే ఏదో ఒక సమస్యను ఇది ఎదుర్కొంటూనే ఉంది. అతి ముఖ్యమైన ఈ పోర్టల్ ను అభివృద్ధి చేయడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ 2019 జనవరి-2021 జూన్ మధ్య కాలంలో రూ. 164.5 కోట్లను ఇన్ఫోసిస్ సంస్థకు చెల్లించింది. యూజర్లు తరచూ ఈ సమస్యను ఈ శాఖ దృష్టికి తెస్తూనే ఉన్నారు. సైట్ స్క్రీన్ షాట్లు తీసి పంపుతూనే ఉన్నారు. ముఖ్యంగా తమ ఇన్ కమ్ టాక్స్ రిటర్నులు సమర్పించే సమయంలో ఇది ఇలా మొండికేయడం వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
కాగా ఇన్ఫోసిస్ నాన్- ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలాంకని-ఇంచుమించు ప్రతివారం ఈ సమస్యను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెస్తూనే ఉన్నారు. ఇలా జరగడానికి చింతిస్తున్నామని పేర్కొంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ ప్రాబ్లమ్ పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామన్నారు. కాగా తనకు జారీ అయిన సమన్లపై సలీల్ పరేఖ్ ఇంకా స్పందించలేదు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు దీని పరిష్కారం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత మద్దతు.. కాబూల్ చేరుకున్న తాలిబన్ కో-ఫౌండర్
వావ్ ! దాల్ సరస్సులోని హౌస్ బోట్ లో ‘ఫ్లోటింగ్ ఏటీఎం’ ! చూడాల్సిందే !