Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaurav Vallabh: ‘కాంగ్రెస్ సనాతన వ్యతిరేకిగా మారింది’.. ఆ పార్టీ స్పోక్స్‌పర్సన్ సంచలన ఆరోపణలు

ఆయన కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి. పార్టీ విధానాలు, వివిధ అంశాలపై పార్టీ వైఖరిని అందరికీ చాటిచెప్పే కీలకమైన పదవిలో ఉన్నారు. కానీ ఆ పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే క్రమంలో రోజురోజుకూ సనాతన ధర్మానికి వ్యతిరేకిగా మారడం, సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పార్టీ కాస్తా వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంపద సృష్టికర్తలను అవమానించడం ఆయనకు నచ్చలేదు.

Gaurav Vallabh: 'కాంగ్రెస్ సనాతన వ్యతిరేకిగా మారింది'.. ఆ పార్టీ స్పోక్స్‌పర్సన్ సంచలన ఆరోపణలు
Gourav Vallabh
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Apr 04, 2024 | 12:58 PM

ఆయన కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి. పార్టీ విధానాలు, వివిధ అంశాలపై పార్టీ వైఖరిని అందరికీ చాటిచెప్పే కీలకమైన పదవిలో ఉన్నారు. కానీ ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP)ని వ్యతిరేకించే క్రమంలో రోజురోజుకూ సనాతన ధర్మానికి వ్యతిరేకిగా మారడం, సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పార్టీ కాస్తా వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంపద సృష్టికర్తలను అవమానించడం ఆయనకు నచ్చలేదు. ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెబుతూ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది.

ఆ నేత మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇన్నాళ్లుగా పనిచేసిన ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తన రాజీనామా లేఖలో అనేకాంశాలను ప్రస్తావిస్తూ పార్టీ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నేడు కాంగ్రెస్ పార్టీ దశా, దిశా లేని తీరుతో ముందుకు సాగుతుండడంపై తాను విసిగిపోయానని గౌరవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ రోజురోజుకూ సనాతన ధర్మానికి వ్యతిరేకిగా మారుతోందని ఆరోపించారు. అలాగే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు దేశంలోని సంపద సృష్టికర్తలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతోందని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. రాజీనామా నిర్ణయంతో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని, తన మనసు చాలా బాధలో ఉందని అన్నారు. నిజాన్ని దాచడం నేరం కాదనీ, నేరంలో భాగమవ్వాలని కోరుకోవడం లేదని చెప్పారు. గత కొన్ని రోజులుగా పార్టీ వైఖరితో అసౌకర్యానికి గురవుతున్నానని, కొత్త ఆలోచనలతో.. ఉరకలెత్తే యువరక్తంతో పార్టీ ముందుకు సాగడం లేదని నిందించారు.

అగ్రనాయకత్వానికి కార్యకర్తలకు మధ్య పెరిగిన దూరం

కాంగ్రెస్ అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ అన్నారు. పెద్ద నాయకులకు అట్టడుగు స్థాయి కార్యకర్తలకు మధ్య అంతరాన్ని తగ్గించడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ అనుసరించిన వైఖరిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రామ మందిరం విషయంలో కాంగ్రెస్ వైఖరి పట్ల తాను కలత చెందానని, తాను పుట్టుకతో హిందువుని, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడినని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమికి చెందిన చాలా మంది వ్యక్తులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, పార్టీ మౌనం వహించడం ఆ వ్యాఖ్యలకు నిశ్శబ్ద ఆమోదం ఇచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు.

తాను వేసిన మార్గానికే వ్యతిరేకంగా…

దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు నాడు కాంగ్రెస్ ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనుకూల వైఖరి కారణంగా దేశం పురోగతి చెందుతుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ అందుకు పూర్తి విరుద్ధంగా పయనిస్తోందని గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. “ఈ రోజుల్లో కాంగ్రెస్ తప్పు దిశలో, తప్పుడు మార్గంలో పయనిస్తోంది. ఒకవైపు కుల ఆధారిత జనాభా గణన గురించి మాట్లాడుతున్నాం, మరోవైపు హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్కింగ్ స్టైల్ కారణంగా పార్టీ ఫలానా మతానికి మాత్రమే మద్దతిచ్చే పార్టీ అని ప్రజలను తప్పుదోవ పట్టించే సందేశాన్ని ఇస్తోంది. ఇది కాంగ్రెస్ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం.” అంటూ తన అభిప్రాయాన్ని లేఖలో పొందుపరిచారు. ఆర్థిక విధానాల గురించి ప్రస్తావిస్తూ.. “ఆర్థిక విషయాలలో ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ సంపద సృష్టికర్తలను అవమానపరచడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోజు మనం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా మారాము, వీటిని దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అమలు చేసినందుకు ప్రపంచం మనకు (కాంగ్రెస్ పార్టీకి) పూర్తి క్రెడిట్ ఇచ్చింది. దేశంలో జరుగుతున్న ప్రతి పెట్టుబడుల ఉపసంహరణపై పార్టీ అభిప్రాయం ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటుంది. మన దేశంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం తప్పా?” అని తన లేఖలో ప్రశ్నించారు.

గౌరవ్ వల్లభ్ పార్టీ వీడి వెళ్లే ముందు ఈ అభిప్రాయాలు చెప్పినప్పటికీ.. పార్టీని వీడలేక, ఉండలేక చాలా మంది నేతలు ప్రొఫెసర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నవారు ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకించడం కోసం ప్రజలు ఆమోదిస్తున్న అనేక విధానాలను వ్యతిరేకించడంపై తీవ్ర అసహనంలో ఉన్నారు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తూ ఎదిగిన అనేక ప్రాంతీయ పార్టీలతో చెట్టపట్టాలేసుకుని తిరగడం కూడా చాలా మంది నేతలకు నచ్చడం లేదు. ఇన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడమే ఎన్నికల కంటే ముందు ఓటమిని అంగీకరించినట్టుగా కొందరు సూత్రీకరిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా తమకు లేదని ఒప్పుకున్నట్టయింది, పొత్తుల కారణంగా పార్టీ శ్రేణులు సైతం నిన్నమొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారితో కలిసి పనిచేయలేకపోతున్నారని వాపోతున్నారు. కాకపోతే ఎవరూ బయటకి చెప్పలేక సతమతమవుతున్నారు. అధినేతలకు ఈ విషయాలు అర్థం కావడం లేదని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు ఏ కోశానా పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ గౌరవ్ బాటలో ఇంకా చాలామంది నేతలు పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..