AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Next Vice President: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు..? ఆదివారమే ఎంపిక.. గెలుపు ఇక లాంఛనమే

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది.

Next Vice President: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు..? ఆదివారమే ఎంపిక.. గెలుపు ఇక లాంఛనమే
JP Nadda, PM Modi, Amit Shah
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 16, 2025 | 7:35 AM

Share

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి.. నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనాయకత్వానికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంట్ ఉభయసభల్లో సభా నాయకులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. అయితే బీజేపీలోని అత్యుతన్న నిర్ణయాత్మక విభాగం (బీజేపీ పార్లమెంటరీ బోర్డు) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ నెల 17న (ఆదివారం) సాయంత్రం గం. 6.00కు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాలలో ఒకటిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరగనుంది. ఇటువంటి ఎన్నిక్లో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదనుపెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్డీఏ సంఖ్యాబలం

పార్లమెంటులో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే.. రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీ(యూ), ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్పీఎఫ్ మరియు ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీయే బలాన్ని 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కు చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు.

ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీయే బలం 293కు చేరుతుంది. రెండు సభలు కలిసి ఓటు వేసినప్పుడు, విజయానికి అవసరమైన సింపుల్ మెజారీటీని ఎన్డీయే సులభంగా అధిగమిస్తుంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి (I.N.D.I.A)లో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టం.

ఉపరాష్ట్రపతి పీఠం కీలకం, వ్యూహాత్మకం

భారత ఉపరాష్ట్రపతి, పార్లమెంటులోని రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్ కావడం వల్ల ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం అధికార కూటమికి వ్యూహాత్మకంగా మారుతుంది. ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్షాలను అదుపుచేస్తూ సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో ఆ పదవిలో కూర్చునే వ్యక్తి శక్తి, సామర్థ్యాలు కీలకంగా మారతాయి. అన్నీ ఆలోచించి నాడు ఉపరాష్ట్రతిగా జగ్‌దీప్ ధన్కడ్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన తన అధికార పరిధిని అతిక్రమించి ప్రభావం చూపాలని ప్రయత్నించారనే ఊహాగానాలు చర్చలోకి వచ్చాయి. అప్పట్లో ఉత్తరాదిన హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే శక్తి, సంఖ్యాబలం కలిగిన జాట్ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ సామాజికవర్గంలో పలుకుబడి కల్గిన విద్యావంతుడు జగ్‌దీప్ ధన్కడ్‌ను ఎంపిక చేసినట్టు కథనాలు వచ్చాయి. గతాన్ని పక్కనపెట్టి.. వర్తమానంలోకి వస్తే.. కొత్త ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మోదీ, నడ్డాలు ఎన్నికల లెక్కలు, అంచనాలు, ఊహాగానాలకు అతీతంగా ఆలోచించే అవకాశం ఉంది. కీలకమైన పదవుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం అందరి ఊహలను తలకిందులు చేస్తూ.. ఎవరూ ఊహించని వ్యక్తులను చివరిక్షణాల్లో తెరపైకి తెచ్చిన ఉదాహరణలు కోకొల్లలు. ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎలాంటి సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్నప్పుడైనా, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) పేరుతో కూటమిగా అధికారంలో ఉన్నప్పుడైనా, ఆ తర్వాత వచ్చిన NDA ప్రభుత్వాలైనా.. గవర్నర్లుగా పనిచేసినవారినో, కేబినెట్ మంత్రులుగా ఉన్నవారినో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా వివిధ నేపథ్యాల నుంచి వచ్చినవారు సైతం ఈ పదవిని నిర్వహించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గవర్నర్‌గా పనిచేసిన జగ్‌దీప్ ధన్కడ్‌కు అవకాశం కల్పించారు. కానీ ఈసారి కచ్చితంగా ఈ తరహా నేపథ్యాలు కల్గినవారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహించే పరిస్థితి లేదు.

గత సమీకరణాలు – అనుభవాలు

గత దశాబ్దకాలంగా బీజేపీ అనుసరించిన విధానాలు, వ్యూహాలను గమనిస్తే.. కీలక పదవులకు ఎంపిక చేసే అభ్యర్థుల ద్వారా రాజకీయంగా బీజేపీ పాదముద్రలను విస్తరించడానికి ఉపయోగించుకుంది. 2017లో ఉత్తరప్రదేశ్ నుంచి దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుని, ఉత్తర – దక్షిణ భారతదేశ సమతుల్యత పాటించింది.

2022లో ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడంతో, రాజస్థాన్ జాట్ నాయకుడు జగదీప్ ధన్ఖర్‌ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. విభిన్న భౌగోళిక ప్రాంతాలు, కులాలు, సముదాయాలను కవర్ చేసే ఈ రొటేషన్ లాజిక్ ఒక అలిఖిత నియమంగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి, తన సంస్థాగత నిర్మాణాన్ని సమీక్షించడానికి సిద్ధమవుతున్న వేళ అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తెరపైకి వచ్చింది. దీంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా ఏర్పడే ఖాళీ, బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కసరత్తు.. ఇవన్నీ కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు, చేర్పులకు ఆస్కారం కల్గించనుంది. ఉదాహరణకు 2017 మాదిరిగా కేబినెట్ మంత్రిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెడితే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యంగా మారుతుంది.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థులపై దృష్టి

ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి కచ్చితంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నేపథ్యం కలిగినవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యం లేనివారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా చేస్తే.. ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించారు. ఆ తర్వాత జగ్‌దీప్ ధన్కడ్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి, విధేయతను ప్రదర్శించే వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది.

ఈ సమీకరణాల ప్రకారం బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు అవకాశాలను సన్నగిల్లాయి. మితవాద ముస్లిం వర్గాలను ఆకట్టుకోడానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎంపిక ఒక వ్యూహాత్మక మార్గమని కొందరు సూచిస్తున్నప్పటికీ.. RSS నేపథ్యం లేకపోవడం ఆయకు మైనస్ పాయింట్‌గా మారింది. మరోవైపు జేడీ(యూ) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేస్తుంది. పార్లమెంటేరియన్‌గా మారిన మాజీ పాత్రికేయుడైన సింగ్ అన్ని పార్టీలతో సౌహార్ద సంబంధాలను కలిగి, రాజ్యసభను నడపడంలో నైపుణ్యం చూపిస్తున్నారు.

2022లో నీతీశ్ కుమార్ ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడు, హరివంశ్ సింగ్ కూడా అలా చేయాలని ఒత్తిడి చేసినప్పటికీ, అందుకు ఆయన నిరాకరించారు. 2024లో నీతీశ్ ఎన్డీఏలో తిరిగి చేరినప్పుడు, సింగ్ మైత్రి సంబంధాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. అతని అభ్యర్థిత్వం నీతీశ్‌ను సంతోషపరుస్తుంది, కానీ బిహార్ తూర్పు భారతదేశంలో ఉంది. మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము తూర్పు భారతదేశానికి చెందినవారే. ఈ పరిస్థితుల్లో హరివంశ్ నారాయణ్ సింగ్ కు అవకాశం లేనట్టే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా సింగ్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు.

రేసులో వినిపిస్తున్న నేతల పేర్లు

మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీ.పి. రాధాకృష్ణన్, 1993 నుంచి 1998 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత్ సంఘచాలక్‌గా పనిచేశాడు. తమిళనాడు నుంచి వచ్చిన ఆయన కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. సామాజిక సమీకరణలను గమనిస్తే.. ఆయన ఓబీసీ సముదాయంలోని గౌండర్ సముదాయానికి చెందిన నేత.బీజేపీ ఈ సముదాయాన్ని కె. అన్నామలై ద్వారా ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అయితే తమిళనాడులో ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు కుదిరిన తర్వాత ఈ ప్రయత్నం ఆగిపోయింది. ఆసక్తికరంగా, పళనిస్వామి కూడా అదే సముదాయానికి చెందినవాడు.

రాధాకృష్ణన్ ఎన్నిక బీజేపీ దక్షిణ భారత విస్తరణను బలపరుస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో మునిగిపోయిన తమిళనాడులో పార్టీ విస్తరణ కోసం బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోంది. ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ద్రవిడ రాజకీయాలు ఆధిపత్యం చెలాయించే తమిళనాడులో వెనుకబడిన కుల సమూహానికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక కాషాయపార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆయన గవర్నర్‌గా ఎక్కువ కాలం గడపడం వల్ల, రాజ్యసభను నిర్వించే ప్రక్రియాత్మక కార్యాకలాపాలకు త్వరగా అలవాటుపడాల్సి ఉంటుంది.

రేసులో వినిపిస్తున్న మరోపేరు థావర్ చంద్ గెహ్లోత్. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ గా పనిచేస్తున్న ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన మరొక నాయకుడు. బీజేపీలో లోతైన మూలాలు కలిగి ఉన్నాడు. మధ్యప్రదేశ్ నుంచి సీనియర్ దళిత నాయకుడు. గెహ్లోత్ లోక్‌సభలో అనేక పర్యాయాలు గెలుపొంది ఎంపీగా పనిచేశాడు. రాజ్యసభలో సభా నాయకుడిగానూ ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగానూ పనిచేశారు. పరిపాలనా అనుభవం, శాసన నైపుణ్యం, సామాజిక నేపథ్యం ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా హిందీ ఆధిపత్య ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత వర్గాల్లో మద్దతును బలోపేతం చేయడానికి ఈ ఎంపిక ఉపయోగపడవచ్చు. అయితే గెహ్లోతో ప్రధాన లోపం ఆయన వయస్సు. ఇప్పటికే 77 ఏళ్ల వయస్సులో ఉన్నందున, బీజేపీ నాయకత్వం నిర్దేశించుకున్న 75 ఏళ్ల వయోపరిమితిని అధిగమించడం ఒక అడ్డంకి కాగా.. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యం మరో అడ్డంకిగా మారుతుంది.

ఊహకందని మోదీ ఎంపికలు.. అంచనాలకు అందని వ్యూహాలు

ప్రధానమంత్రి ఎంపికను ఊహించడం ఎల్లప్పుడూ సవాలుతో కూడిన పని. మోదీ రాజకీయ వ్యూహం ఆశ్చర్యకరమైన ఎంపికల ద్వారా, సాంప్రదాయ లెక్కలను తలకిందులు చేస్తూ, నిపుణుల అంచనాలను బద్దలు కొడుతూ ఉంటాయి. గతంలో ఎన్నో సమీకరణాలు బేరీజు వేసుకుంటూ చర్చలోకి తీసుకున్న పేర్లలో అత్యధికులను నాయకత్వం విస్మరించింది. ఈ అనూహ్య నిర్ణయాలు మోదీ రాజకీయ నైపుణ్యంలో భాగం. ఇది అతని మిత్రులతో పాటు వ్యతిరేకులను సైతం ఊహలకు అందకుండా చేస్తుంది. ఎన్డీఏలోని మహిళా అభ్యర్థులను, ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ నుంచి తీసుకురావాలనే చర్చ జరిగింది. అయితే దేశంలో ఇప్పటికే ముర్ము రూపంలో మహిళా రాష్ట్రపతి ఉన్నందున, ఆ ఆలోచన ఆదిలోనే ఆగిపోయింది. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో మకాం పెట్టి బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీలు జరిపారన్న వార్తలతో ఆయన మరోసారి రేసులో ఉన్నారన్న చర్చ ఊపందుకుంది.

మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు పార్టీకి జాతీయాధ్యక్షులుగా పనిచేయడం ఒకెత్తయితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రులుగా పాలనా అనుభవం రాజ్యసభను నిర్వహించడంలో ఉపయోగపడతాయని, గతంలో వెంకయ్య నాయుడు మాదిరిగా ఆ నేతలకు క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించనట్టుగానూ ఉంటుందని చర్చ జరుగుతోంది.

ఈ ఎంపికలను పరిశీలిస్తున్నప్పుడు, బీజేపీ మిత్రపక్షాలతో సయోధ్య, పార్టీ సంస్థాగత బలోపేతం, భౌగోళిక విస్తరణ, భావజాల విధేయత వంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మోదీ సాధారణంగా సామాజికంగా వెనుకబడిన సముదాయాలు, మహిళలు, రైతులు, ఓబీసీలు, గిరిజనులు, దళితులకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈసారి ఆయన ఏ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారు.. ఎవరిని తెరపైకి తెస్తారు అన్న చర్చ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.

ప్రతిపక్ష వ్యూహం

ప్రతిపక్షం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, ఎన్డీఏ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఒక కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది. కానీ ఎన్డీఏ సంఖ్యాబలం కారణంగా, ఈ పోటీ కేవలం పేరుకే తప్ప ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని ఆ కూటమి నేతలందరికీ తెలుసు. అయితే అధికార కూటమికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడానికి, తమ ఓటుబ్యాంకును కాపాడుకోడానికి ఈ ఎన్నికలను ప్రతిపక్ష కూటమి ఒక సాధనంగా మార్చుకోవాలని చూస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..