Raghunandan Rao: బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉన్నారు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.
BJP MLA Raghunandan Rao: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యనేతలతో కలిసి అమిత్‌షాను కలుసుకున్నామన్నారు. త్వరలో తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని రఘునందన్ రావు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున, సమావేశాలు ముగిశాక, తేదీ ఖరారు చేస్తానని అమిత్ షా చెప్పారని ఆయన తెలిపారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సన్నద్ధంగా ఉండాలని అమిత్ షా దిశానిర్ధేశం చేశారన్నారు.
అయితే, సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా సమరానికి సిద్ధం కావాలని నేతలకు అమిత్ షా సూచించారని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్‌తో ముందుకెళ్తామన్నది అందరికీ చెప్పేది కాదన్నారని ఆయన అన్నారు. అయితే, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. సీఎం కేసీఆర్‌లో ఫ్రస్ట్రేషన్ స్థాయి పెరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో భారీ బహిరంగ నిర్వహించాలని తలపెట్టామని, ఈ సభకు రావాల్సిందిగా అమిత్ షాను కోరామని రఘునందన్ రావు తెలిపారు. ఒక రోజు కాదు, రెండ్రోజులు పెట్టండి, వస్తా అని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు.
అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభ కోసం పరేడ్ గ్రౌండ్స్, లేదంటే సీఎం సొంత ఇలాఖాలో పెట్టాలా.. అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. అలాగే. కేసీఆర్ ప్రతిరోజూ ఉపయోగిస్తున్న బూతు భాష గురించి కూడా అమిత్ షా దృష్టికొచ్చినట్లు ఆయన తెలిపారు. ముడి బియ్యం ఎంత ఇచ్చినా కొంటామని అంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, బూతు భాషను ఎందుకు ఉపయోగిస్తున్నారని అమిత్ షా ఆరా తీశారన్నారు. అలాగే, బీజేపీలో చేరడం కోసం చాలా మంది సంప్రదింపులు జరుపుతున్నారని రఘునందన్ తెలిపారు. చేరాలనుకుంటున్నవారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారన్నారు. జాతీయ నాయకత్వంతో కొందరు నేతలు టచ్‌లో ఉన్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు..