స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో ఆ తప్పులకు చెక్..
బోర్డ్ ఎగ్జామ్స్ హిస్టరీలోనే ఇది సరికొత్త విప్లవం అని చెప్పొచ్చు. దీన్ని వల్ల పరీక్ష రాసిన విద్యార్థులకు ఒక్క మార్కు కూడా అన్యాయం జరిగే ఛాన్స్ లేదు. మార్కుల కౌంటింగ్‌లో టీచర్లు చేసే తప్పులకు చెక్ పెడుతూ.. విద్యాశాఖ టెక్నాలజీతో రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా 98 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను డిజిటల్ స్క్రీన్‌పైకి తెచ్చి, 3 లేయర్స్ సెక్యూరిటీతో ఆన్-స్క్రీన్ మూల్యాంకనం పూర్తి చేసింది.

దేశంలో విద్యావ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్‌మెంట్ కీలక అడుగు వేసింది. ఈ ఏడాది నిర్వహించిన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 98 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను పూర్తిగా స్కాన్ చేసి, డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ వినూత్న నిర్ణయం వల్ల విద్యార్థుల మార్కుల లెక్కింపులో జరిగే మానవ తప్పిదాలకు పూర్తిగా చెక్ పడిందని వారు స్పష్టం చేశారు.
మూడు అంచెల భద్రత.. లీకేజీలకు తావులేదు
ఈసారి పరీక్షల నిర్వహణ ముగిసిన వెంటనే ప్రతీ విద్యార్థి జవాబు పత్రాన్ని అత్యంత అధునాతన స్కానర్ల ద్వారా స్కాన్ చేసి, వాటిని పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మార్చారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడా డేటా లీక్ కాకుండా ఉండేందుకు అలాగే గోప్యతను కాపాడేందుకు మూడు అంచెల భద్రత విధానాన్ని అమలు చేశారు. దీనివల్ల విద్యార్థుల వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం అస్సలు ఉండదు. ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఉపాధ్యాయులకు ముందే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, డిజిటల్ మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ఆ 13 వేల పేపర్లు మాత్రం మాన్యువల్‌గా..
ఈ డిజిటల్ ప్రయోగంలో ఎదురైన ఒక చిన్న సాంకేతిక ఇబ్బందిని కూడా విద్యాశాఖ అత్యంత బాధ్యతాయుతంగా పరిష్కరించింది. దాదాపు 98 లక్షల పేపర్లను స్కాన్ చేయగా.. అందులో సుమారు13,000 జవాబు పత్రాలు ఎన్నిసార్లు స్కాన్ చేసినా స్పష్టంగా కనిపించలేదు. విద్యార్థులు రాసేటప్పుడు చాలా లైట్ కలర్ ఇంక్ వాడటమే ఇందుకు కారణం. అయితే డిజిటల్ స్క్రీన్‌పై స్పష్టత లేని కారణంగా ఆ విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ 13 వేల పేపర్లను విడిగా పక్కన పెట్టి, టీచర్ల చేత మాన్యువల్‌గా దిద్దించారు. అలా దిద్దిన మార్కులను పక్కాగా సిస్టమ్‌లో ఎంటర్ చేసి, ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ డిజిటల్ విధానం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు
జీరో టోటలింగ్ మిస్టేక్స్: గతంలో పేపర్లు దిద్దినప్పుడు మార్కులు కూడటంలో అప్పుడప్పుడు పొరపాట్లు జరిగేవి. కంప్యూటరైజ్డ్ స్క్రీనింగ్ వల్ల ఆ తప్పులు ఇప్పుడు 100శాతం తొలగిపోయాయి.
వేగవంతమైన ఫలితాలు: మ్యాన్యువల్ పద్ధతితో పోలిస్తే డిజిటల్ స్క్రీనింగ్ ద్వారా ఫలితాలను చాలా వేగంగా సిద్ధం చేయవచ్చు.
రీ-వెరిఫికేషన్ ఈజీ: విద్యార్థులు రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోరినప్పుడు డిజిటల్ కాపీలు అందుబాటులో ఉండటం వల్ల ప్రక్రియ మరింత సులువవుతుంది.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భద్రత మరియు ఖచ్చితత్వాన్ని అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
#WATCH | Delhi: Sanjay Kumar, Secretary, Department of School Education and Literacy, says, “This time when the 12th class exams were conducted, the answer sheets were scanned, and their PDF copies were made. The total number of answer sheets of 98 lakh students who took the… pic.twitter.com/cIeztuNgUF
— ANI (@ANI) May 17, 2026
