AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!

Virat Kohli Harpreet Brar Fight: ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న కీలక పోరులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరుగు తీసే క్రమంలో ప్రత్యర్థి ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ తనను రనౌట్ చేస్తానంటూ కళ్లెర్రజేయగా, కింగ్ కోహ్లీ సైతం అంతే దీటుగా ఇచ్చిన ‘డెత్ స్టేర్’ మైదానాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!
Virat Kohli Video
Venkata Chari
|

Updated on: May 17, 2026 | 6:11 PM

Share

Virat Kohli Harpreet Brar Fight: వరుసగా 5 పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయంతో దూరం కావడంతో జితేష్ శర్మ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ ఐదో బంతి వద్ద అసలు డ్రామా మొదలైంది. కోహ్లీ బంతిని పాయింట్ దిశగా నెట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్‌ప్రీత్ బ్రార్ అత్యంత వేగంగా బంతిని అందుకున్నాడు. ముప్పును గమనించిన పడిక్కల్ పరుగును తిరస్కరించడంతో కోహ్లీ తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ క్రీజు వెలుపల ఉండటం చూసిన బ్రార్, అతన్ని భయపెట్టేందుకు బంతిని వికెట్ల వైపు విసురుతున్నట్లు ఫేక్ త్రో చేశాడు.

తలపడదాం రా.. విరాట్ సవాల్..!

సాధారణంగానే మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీకి ఈ చర్య తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తను క్రీజు బయట ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా, వెనక్కి తగ్గకుండా అలాగే నిలబడిపోయాడు. హర్‌ప్రీత్ బ్రార్ కళ్లలోకి కళ్లు పెట్టి తీవ్రమైన చూపులతో చూస్తూ.. ‘చేతనైతే వికెట్లను పడగొట్టు చూద్దాం’ అన్నట్లుగా నిలబడ్డాడు. కోహ్లీ రుద్రరూపానికి ఒక్కసారిగా షాక్‌కు గురైన పంజాబ్ ఫీల్డర్ బ్రార్, బంతిని వికెట్లపైకి విసరాలనే ఆలోచనను విరమించుకుని సాదాసీదాగా తన సహచర ఆటగాడికి అందించాడు. ఈ ఇరు ఆటగాళ్ల మధ్య నడిచిన కొన్ని సెకన్ల మాటల్లేని యుద్ధం కెమెరాల్లో బందీ అయి, అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.

మరోసారి చెలరేగిన రికార్డుల రారాజు..

ఈ ఘర్షణ తర్వాత కోహ్లీ మరింత కసితో ఆడాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 31 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది 67వ అర్ధశతకం కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ 2026 సీజన్‌లో 500 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం కోహ్లీకి ఇది తొమ్మిదోసారి. ఈ పరుగుల వరదతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుని, ఈ ఏడాది కూడా కప్పును కాపాడుకునే దిశగా పయనిస్తోంది.

రజత్ పాటిదార్ గాయంపై ఆందోళన..

ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడటం ఆ జట్టు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అతనికి ఎలాంటి గాయమైందనే విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. అయితే మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ సమయానికి పాటిదార్ జట్టులోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు.

మైదానంలో ఎంతటి ఒత్తిడి ఎదురైనా, ప్రత్యర్థులు కయ్యానికి కాలు దువ్వినా తనదైన శైలిలో సమాధానం చెప్పడం కింగ్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. హర్‌ప్రీత్ బ్రార్‌తో జరిగిన ఈ ముఖాముఖి పోరు బెంగళూరు-పంజాబ్ జట్ల మధ్య సాంప్రదాయ శతృత్వాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ అగ్నికి తోడు కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపం కూడా తోడవడంతో ఈ మ్యాచ్ లీగ్ దశలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us