AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan App Harassment: వద్దన్నా రుణాలిస్తారు.. వేధింపులతో ప్రాణాలు తీసుకుంటారు.. లోన్ యాప్ లతో జాగ్రత్త సుమా!

సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఇటీవల కాలంలో అనేక లోన్ యాప్ లు పుట్టుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజూ రకరకాల పేర్లతో ఈ మైక్రో ఫైనాన్స్ యాప్ లు పుట్టుకొస్తున్నాయి. గతంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు గ్రామాలకు వచ్చి రుణాలిస్తూ.. ఏజెంట్లను..

Loan App Harassment: వద్దన్నా రుణాలిస్తారు.. వేధింపులతో ప్రాణాలు తీసుకుంటారు.. లోన్ యాప్ లతో జాగ్రత్త సుమా!
Loan App Harassment
Amarnadh Daneti
|

Updated on: Oct 02, 2022 | 4:34 PM

Share

సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఇటీవల కాలంలో అనేక లోన్ యాప్ లు పుట్టుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజూ రకరకాల పేర్లతో ఈ మైక్రో ఫైనాన్స్ యాప్ లు పుట్టుకొస్తున్నాయి. గతంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు గ్రామాలకు వచ్చి రుణాలిస్తూ.. ఏజెంట్లను పంపించి ప్రతివారం వసూలు చేసుకునేవి. ఏదైనా వారం గ్రూపులో ఒకరు కట్టకపోయినా అందరికి ఫైన్ పడేది. ఇలా మైక్రోఫైనాన్స్ సంస్థలకు బయపడి.. గ్రూపులో రుణం తీసుకున్నవారు ఏదైనా వారం వాయిదా కట్టకపోతే.. మిగిలిన సభ్యులు సర్ధుబాటు చేసి కట్టేవారు. ఆ తర్వాత ఈ సంస్థల వేధింపులు పెరిగిపోవడంతో ప్రభుత్వం కలుగజేసుకుని.. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. అయితే కాలం మారి.. అంతా ఆన్ లైన్ కావడంతో.. ఈ సంస్థల యజమానులు కొత్త అవతారం ఎత్తారు. ఆన్ లైన్ లో రకరకాల పేర్లతో యాప్ క్రియేట్ చేసి ఆర్థిక అవసరాలు ఉన్న వారికి క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను క్యాచ్ చేసుకుంటూ.. డబ్బు సంపాదించడం కోసం ఈ సంస్థలు ఎంతటి దారుణాలకైనా వెనకాడవు. చివరికి విద్యార్థులకు కూడా క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి.

ముఖ్యంగా వేతన జీవులను ఈ లోన్ యాప్ లు టార్గెట్ చేస్తున్నాయి. నెలవారీ జీతంపై ఆధారపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకటో తేదీ జీతం తీసుకుంటే మళ్లీ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అందరికి ఖర్చులు పెరగడం, వచ్చే జీతాలు తక్కువ కావడంతో నెల పూర్తవకుండానే ఆదాయం ఖర్చు అయిపోతుంది. దీంతో నెల మధ్యలోనే ఆర్థిక కష్టాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారి అవసరాలను గుర్తించి ఈ లోన్ యాప్ లు వేతన జీవులను ఆకర్షిస్తున్నాయి. తక్షణమే అవసరానికి డబ్బులిస్తున్నాడు కదా అనే ఆలోచనతో.. అప్పుడు మన అవసరం తీరుతుంది కదా అనుకుని ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నాడు. మనం ఎంత తీసుకుంటే ఎంత కట్టాలో తెలుసుకోకుండా ఎంతిస్తే అంత రుణం తీసుకుంటున్నారు వేతన జీవులు. తిరిగి రుణం చెల్లించడానికి వారిచ్చే సమయం కూడా ఒక వారం, రెండు వారాలు మాత్రమే. వేతన జీవులకు నెల మధ్యలోనే డబ్బులు అవసరమవుతాయని గమనించి.. వారికి రుణాలిచ్చి.. మళ్లీ జీతం రాగానే ఒకటో తేదీ వసూలు చేసుకునేలా తమ బిజినెస్ ను ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే తీసుకున్న వారం తర్వాత లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణానికి కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఆలస్యం అయితే వెంటనే వందల కొద్ది ఫోన్ కాల్స్ చేస్తూ వేధించడం మొదలుపెడుతున్నారు.

ఒకరోజు ఆలస్యమైన రోజు లెక్క వడ్డీ విధిస్తూ.. మొత్తం రుణాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ఈ లోన్ యాప్ లు. ఏదో బాధపడి తీసుకున్న రుణం వడ్డీతో కలిపి చెల్లించినా, ఇంకా మీ లోన్ క్లియర్ కాలేదు అంటూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి ఈ కంపెనీలు. ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఫోటోలు మార్పింగ్ చేసి, రుణం తీసుకున్న వ్యక్తి ముఖాన్ని ఇరత న్యూడ్ ఫోటోలతో కలిపి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తూ ప్ఱశాంతత లేకుండా చేస్తున్నాయి ఈ సంస్థలు. ఈ వేధింపులు భరించలేక దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల ప్రతి రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిని చూస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ఘటన జరిగినప్పుడు సిరీయస్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నా.. కొద్దిరోజులు గడిచాక వాటి గురించే మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ లోన్ యాప్ లు విదేశాల్లో నమోదై.. ఆన్ లైన్ యాప్ ద్వారా బిజినెస్ చేస్తుండటంతో వీరిపై చర్యలు తీసుకోవడం కూడా ఒకింత కష్టమవుతుంది. అప్పటికి నిబంధనలు పాటించని యాప్ లపై నిషేధం విధిస్తున్నా.. రోజుకో పేరుతో అవే సంస్థలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ లోన్ యాప్ ఆగడాలను తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఇదొక ఘటనే కాదు. ఇటీవల కాలంలో లోన్ యాప్ సంస్థల వేధింపులు భరించలేక తెలుగు రాష్ట్రాల్లోనే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి దేశంలో ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇవ్వన్నీ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం నడుస్తాయి. ఈ సంస్థలు రుణాలు ఇవ్వడానికి అనేక నిబంధనలు ఉంటాయి. ఈ రూల్స్ కొద్దిగా ఇబ్బందిగా భావించి.. చాలా మంది ఇలా ఆన్ లైన్ యాప్ లలో రుణాలు తీసుకుంటూ చివరికి ఆత్మహత్యలు చేసుకోవల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వడ్డీ సక్రమంగా చెల్లించి.. బ్యాంకు వారు విధించిన గరిష్ట పరిమితిలోపు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. లోన్ యాప్ సంస్థల వలె బ్యాంకు ప్రతినిధులు ఎవరూ వేధించరు. అయితే బ్యాంకు రుణాలు పొందడానికి మన ఆర్థిక స్థోమత, క్రెడిట్ స్కోర్ వంటివి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో ఈ రూల్స్ ను భారంగా ఫీలయ్యి చాలా మంది ఆన్ లైన్ యాప్ లలో రుణాలు తీసుకుంటూ మోసపోతున్నారు. తాము మోసపోయామని తెలుసుకునేలోపు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు, రుణాలు ఇచ్చి.. ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తున్న సంస్థలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

ప్రజలు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుని, తమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు.. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం నడిచే సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. వెంటనే డబ్బులు ఇస్తున్నాడనే ఉద్దేశంతో ఆన్ లైన్ యాప్ లలో రుణాలు తీసుకుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని టీవీ9 తెలుగు మిమల్ని కోరుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..