ఈ ఆలయంలో పెళ్లిళ్లు నిషేధం.. కారణం తెలిస్తే అవాక్కవడం పక్కా..
బెంగళూరులోని హలసూరు సోమేశ్వరస్వామి ఆలయంలో గత ఏడేళ్లుగా వివాహాలు నిలిపివేశారు. విడాకుల కేసుల్లో పూజారులు కోర్టుకు హాజరుకావడం న్యాయపరమైన చిక్కులకు దారితీయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రతిష్ట, పూజారుల రక్షణ కోసమే ఈ చర్య అని యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. ఇది ఆలయ చరిత్రలోనే కీలక మార్పు.ః

బెంగళూరు నగరంలోని అతి పురాతన, చారిత్రక దేవాలయాలలో ఒకటైన హలసూరు శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం గత ఏడు సంవత్సరాలుగా వివాహ వేడుకలను నిర్వహించడం పూర్తిగా నిలిపివేసింది. ఆలయ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన సమాచారంలో ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆలయ ప్రతిష్టను కాపాడటం, పూజారులను న్యాయపరమైన చిక్కుల నుండి రక్షించడం కోసం తీసుకున్నట్లు తెలిపింది.
ఆలయ చరిత్ర
సోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆలయంలో వివాహాలు నిలిపివేయడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది.
వివాహాలు నిలిపేయడానికి కారణాలు
ఆలయ నిర్వహణ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ కార్యక్రమాలను ఆపివేయడానికి ప్రధాన కారణం మతపరమైనది కాకుండా న్యాయపరమైనది కావడం గమనార్హం. గతంలో ఆలయంలో వివాహం చేసుకున్న జంటలు విడిపోయి విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. అయితే విచారణ సమయంలో ఆలయ పూజారులను కూడా సాక్ష్యం చెప్పడానికి కోర్టులకు హాజరు కావాల్సిందిగా పిలిచేవారు. దీంతో పూజారులు తీవ్రమైన ఒత్తిడికి గురై ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేయడానికి నిరాకరించారు.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆలయానికి కళంకం తీసుకురాకుండా, ఆలయం గురించి తప్పుడు ప్రచారం జరగకుండా ఉండేందుకే పెళ్లిళ్లు చేయడం నిలిపివేసినట్లు ఆలయ ప్రస్తుత ఈవో స్పష్టం చేశారు. యాజమాన్యం గత 6-7 సంవత్సరాలుగా ఈ వేడుకలను మౌఖిక ఆదేశాల ద్వారా నిలిపివేసిందని, తాజాగా ప్రభుత్వానికి ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు ఈవో వెల్లడించారు. ఆలయ పవిత్రత, గౌరవం కాపాడటం కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని నిర్వహణ బోర్డు తెలిపింది.




