IAS Ashok Khemka: ‘రోజుకు 8 నిముషాల పనికి ఏడాదికి రూ.40 లక్షలు తీసుకుంటున్నా..! అవినీతి నిర్మూలనకు అవకాశం ఇవ్వండి..’
ఎక్కువ సార్లు బదిలీలు పొందిన ఐఏఎస్ అశోక్ ఖేమ్కా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సోమవారం (జనవరి 23) లేఖ రాశారు. ఈ లేఖలో రోజుకు 8 నిమిషాల పనికి ఏడాదికి రూ.40 లక్షల జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు..
ఎక్కువ సార్లు బదిలీలు పొందిన ఐఏఎస్ ఆఫీసర్‌గా అశోక్ ఖేమ్కా పేరు గత కొంత కాలంగా వార్తల్లో నిలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఖేమ్కా తన 30 ఏళ్ల కెరీర్‌లో ఇది 56వ బదిలీ కావడం విశేషం. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగారు. ఆర్కైవ్స్ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి. 2025లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఐతే తాజాగా అశోక్ ఖేమ్కా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సోమవారం (జనవరి 23) లేఖ రాశారు. ఈ లేఖలో రోజుకు 8 నిమిషాల పనికి ఏడాదికి రూ.40 లక్షల జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు తనను హర్యానా రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి ట్రాన్ఫర్ చేయవల్సిందిగా తన లేఖలో కోరారు. దీనిపై ఆయన 23వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు.
నన్ను జనవరి 9, 2023న రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ శాఖ వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 0.0025 శాతం కన్నా తక్కువ. ఇక్కడ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా నాకు ఏడాదికి రూ.40 లక్షల జీతం చెల్లిస్తున్నారు. ఈ శాఖ మొత్తం బడ్జెట్‌లో 10 శాతం అన్నమాట. ఆర్కైవ్స్ విభాగంలో వారానికి గంట మాత్రమే పని ఉంటుంది. మరోవైపు ఇతర శాఖల్లో కొందరు అధికారులకు పనిభారం ఎక్కువవడంతో సతమతమవుతున్నారు. ఏక పక్షంగా పని పంపిణీ చేయడం వల్ల ప్రజా ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రతి అధికారికి చిత్తశుద్ధి, సమర్థత, తెలివితేటలను దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాల్లో పనులను కేటాయించాలి. అవినీతి ప్రతిచోటా ఉందని మీకు తెలుసు. ఈ అవినీతి క్యాన్సర్‌ను అంతం చేయడానికి నేను నా కెరీర్‌ను పణంగా పెట్టాను. అవినీతిని రూపుమాపేందుకు విజిలెన్స్ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తోంది. నా కెరీర్ చివరి కాలంలో విజిలెన్స్ విభాగంలో సేవలు అందిచాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాననని తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యలయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు వెలువడలేదు.
నిజాయితీ కలిగిన ఇటువంటి అధికారులు అరుదుగా ఉంటారని గత ఏడాది హర్యానా క్యాబినెట్ మంత్రి అనిల్ విజ్ ఖేమ్కా కొనియాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి అధికారిని చూడలేదన్నారు. మంత్రి అభిప్రాయంతో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఏకీభవించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.