Modi Mantra: ఆ టెక్నాలజీతో తస్మాత్ జాగ్రత్త.. కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక.. ఇంతకీ ఏం చెప్పారంటే?

ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నున్నాయో.. దుష్ప్రభావాలు, దుష్పరిణామాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా 'డీప్ ఫేక్' టెక్నాలజీ యావత్ ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే కాదు, సైబర్ నేరాలకు సైతం ఆయుధంగా మారుతోంది. ఈ టెక్నాలజీ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'లో ఒక భాగం.

Modi Mantra: ఆ టెక్నాలజీతో తస్మాత్ జాగ్రత్త.. కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక.. ఇంతకీ ఏం చెప్పారంటే?
Narendra Modi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 04, 2024 | 10:43 AM

ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నున్నాయో.. దుష్ప్రభావాలు, దుష్పరిణామాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ యావత్ ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే కాదు, సైబర్ నేరాలకు సైతం ఆయుధంగా మారుతోంది. ఈ టెక్నాలజీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో ఒక భాగం.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పూర్తిగా ‘మాయ’ చేయడం ఈ టెక్నాలజీతో సాధ్యం. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ టెక్నాలజీపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. తాను గార్భా నృత్యం చేస్తున్నట్టుగా ఓ ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైందంటూ ఉదహరించారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ అంశాన్ని కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో జరిగిన విస్తృతస్థాయి మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించారు. సరిగ్గా చెప్పాలంటే మంత్రులందరినీ హెచ్చరించారు. “జాగ్రత్తగా ఉండండి.. ప్రత్యర్థులు ఈ టెక్నాలజీని ప్రయోగించి మీ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపే ప్రమాదం ఉంది. ఈ ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ ముఖాన్ని మార్చడమే కాదు, మీ గొంతుతో మాట్లాడించగలదు. అందుకే మాట్లాడే సమయంలో అప్రమత్తంగా ఉండండి” అంటూ హితబోధ చేశారు.

లోక్ సభ ఎన్నికల వేళ ఏది మాట్లాడినా ప్రత్యర్థులు దాని నుంచి లబ్ది పొందాలని చూస్తారు. అసలే బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అలాంటి నోటిదురుసు నేతలు కొందరికి బీజేపీ తొలి జాబితాలో చోటివ్వకుండా గట్టి సందేశాన్ని పంపిన కమలదళం అధిపతులు, ఇప్పుడు మంత్రులను కూడా ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. “మన ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న, చేయనున్న పథకాల గురించి మాత్రమే మాట్లాడండి. అనవసరపు వివాదాల జోలికి వెళ్లకండి. వివాదాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేయకండి. చాలా సంయమనంగా వ్యవహరించండి” అంటూ కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ నేతలు ఎవరు ఏది మాట్లాడినా ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడమని అర్థం. చివరగా సమావేశాన్ని ముగిస్తూ.. “వెళ్లండి. వెళ్లి మళ్లీ గెలిచి తిరిగి రండి. కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిద్దాం” అంటూ కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులను ప్రధాని ఉత్సాహపరిచారు.

బీజేపీ ఎంపీకి ‘డీప్ ఫేక్’ షాక్

‘డీప్ ఫేక్’ దుష్పరిణామాల గురించి ప్రధాని మోదీ ఓవైపు కేంద్రమంత్రులకు హితబోధ చేస్తున్న సమయంలోనే మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీలో ఓ ఘటన చోటుచేసుకుంది. బారాబంకీ నుంచి మరోసారి ఎంపీగా పోటీచేసేందుకు అభ్యర్థుల జాబితాలో చోటు సంపాదించిన ఉపేంద్ర సింగ్ రావత్ అశ్లీల వీడియో నెట్టింట హల్చల్ చేసింది. బీజేపీ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన కాసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎంపీ రావత్ ఓ మహిళతో పడకగదిలో ఉన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఇది పూర్తిగా ఫేక్ వీడియో అని ఆ ఎంపీ కొట్టిపడేశారు. తనకు టికెట్ రావడంతో ప్రత్యర్థులు ఈ దుష్టపన్నాగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఈ వీడియో పోస్టుచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తన పీఏ ద్వారా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ‘డీప్ ఫేక్’ వీడియో సృష్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) కూడా నమోదు చేశారు.

ఈ వీడియో క్లిప్ నిజమా లేక ‘డీప్ ఫేక్’ ద్వారా తయారుచేశారా అన్నది ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలుతుంది. కానీ ఫేక్ వీడియోలు తయారు చేసే అవకాశాలు ఈరోజుల్లో చాలా ఎక్కువనే చెప్పవచ్చు. రాజకీయాల్లోనే కాదు, వివిధ రంగాల్లో పోటీని ఎదుర్కొనేవారికి ప్రత్యర్థుల నుంచి ఈ ముప్పు పొంచి ఉంటుంది. వారి ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా తమ ‘ఈగో’ను సంతృప్తిపర్చుకునే కొందరు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. కాబట్టి ఈ ముప్పు కేవలం రాజకీయాల్లో ఉన్నవారికే కాదు, ప్రతి రంగంలోనూ ఉంటుందన్న విషయం మరువరాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..