Bangalore Demolition: యూపీ రూట్‌లో కర్ణాటక.. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న బొమ్మై సర్కార్
Bangalore Demolition: ఇటీవల కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. సిలికాన్ సిటీ బెంగళూరు నీట మునిగింది. నగరవాసులు నరకయాతన అనుభవించారు. ఐతే ఈ పరిస్థితికి అక్రమ నిర్మాణాలే కారణమని..
Bangalore Demolition: ఇటీవల కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. సిలికాన్ సిటీ బెంగళూరు నీట మునిగింది. నగరవాసులు నరకయాతన అనుభవించారు. ఐతే ఈ పరిస్థితికి అక్రమ నిర్మాణాలే కారణమని ఆరోపణలొచ్చాయి. దీంతో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది బొమ్మై సర్కార్. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన బిల్డింగ్స్ కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. నగరంలో మొత్తం 690కి పైగా ఆక్రమణలు ఉన్నాయని.. ఇందులో అత్యధికంగా 175 నిర్మాణాలు మహదేవ్‌పురలోనే ఉన్నట్టు గుర్తించారు అధికారులు. 60కి పైగా బుల్‌డోజర్లు, జేసీబీలతో రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలుగా గుర్తించిన వాటన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు. భారీ అపార్ట్‌మెంట్లను సైతం వదల్లేదు. చల్లఘట్ట, మహదేవ్‌పురా, యలహంకలో కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలో భారీ వరదలకు ఆక్రమణలే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారు ఎంతటివారైనా నోటీసులు అందించామని..అన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు సీఎం. వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ఎవరు నిర్మాణాలు చేపట్టినా తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. మరోవైపు చాలా చోట్ల చెరువులు, నాలాలను పూడ్చి నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదలు ముంచెత్తినట్టు నిపుణులు చెబుతున్నారు. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను కూల్చేస్తునట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇటీవలే యూపీ నోయిడాలో సూపర్‌టెక్ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నేలమట్టం చేశారు. ఇప్పుడు అదే బాటలో బెంగళూరులోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి