Baba Ramdev: వెనక్కి తగ్గిన బాబా రాందేవ్.. ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ
ముస్లీంలందరూ టెర్రరిస్టులంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై..
ముస్లీంలందరూ టెర్రరిస్టులంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తప్పా ఒప్పా అన్నది ఎవరికివారే ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. కాగా ఫిబ్రవరి 3న రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ప్రసంగంలో ముస్లింలందరూ ఉగ్రవాదులు, రేపిస్టులని నోరు జారారు. దీంతో రామ్‌దేవ్ బాబాపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు సోనెపట్ జిల్లాలోని గోహనాలోని భగత్ ఫూల్ సింగ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సూర్య నమస్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాబా రామ్‌దేవ్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
యోగా గురువు రామ్‌దేవ్ బాబా ఇలా నోరు జారడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా మహిళలపై చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. స్త్రీలు చీరలో అందంగా కనిపిస్తారు. వారు సల్వార్‌లోనూ అందంగా కనిపిస్తారు. దుస్తులు ధరించకపోయినా నా కళ్లకు అందంగా కనిపిస్తారని రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ కోరుతూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. బాబా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు, క్షమాపణ లేఖను కమిషన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.