Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarpanch Elections: సర్పంచి కుర్చీకి వేలం పాట.. రూ.2 కోట్లతో పదవి కొనుక్కున్న పెద్ద మనిషి

ఓ గ్రామంలో పోలింగ్‌తో సంబంధం లేకుండా సర్పంచిని వేలం పాటలో ఎన్నుకోవడం జరిగింది. ఇందులో సర్పంచి పదవి ఏకంగా రూ.2 కోట్లు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విచిత్ర ఘటన గురుదాస్‌పూర్‌లోని హల్దోవల్‌ కలన్‌ గ్రామంలో జరిగింది. ఆ ఊరి సర్పంచ్ పదవి కోసం జరిగిన వేలం పాటలో ఓ వ్యక్తి రూ.2 కోట్లు చెల్లించి పదవిని కొనేసుకున్నాడు..

Sarpanch Elections: సర్పంచి కుర్చీకి వేలం పాట.. రూ.2 కోట్లతో పదవి కొనుక్కున్న పెద్ద మనిషి
Auction For Sarpanch Seat
Srilakshmi C
|

Updated on: Oct 01, 2024 | 6:52 PM

Share

చండీగఢ్‌, అక్టోబర్‌ 1: పంజాబ్‌లో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్‌కు ముందే ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటనలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ గ్రామంలో పోలింగ్‌తో సంబంధం లేకుండా సర్పంచిని వేలం పాటలో ఎన్నుకోవడం జరిగింది. ఇందులో సర్పంచి పదవి ఏకంగా రూ.2 కోట్లు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విచిత్ర ఘటన గురుదాస్‌పూర్‌లోని హల్దోవల్‌ కలన్‌ గ్రామంలో జరిగింది. ఆ ఊరి సర్పంచ్ పదవి కోసం జరిగిన వేలం పాటలో ఓ వ్యక్తి రూ.2 కోట్లు చెల్లించి పదవిని కొనేసుకున్నాడు.

తాజాగా ఈ ఊరి సర్పంచి పదవి కోసం వేలం పాట నిర్వహించారు. రూ.50 లక్షలతో వేలం మొదలైంది. జోరుగా సాగిన ఈ వేలం పాటలో స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్‌ ఏకంగా రూ.2 కోట్లు పాడారు. గ్రామానికి ఎవరు ఎక్కువ నిధులు ఇస్తారో వారినే సర్పంచిగా ఎన్నుకుంటారని సదరు నేత చెబుతున్నారు. సోమవారంతో వేలం పాటకు గడువు ముగియడంతో చెక్కు ద్వారా వేలం సొమ్మును అప్పగించారు. ఈ వేలం డబ్బుని గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. నిధుల కేటాయింపును గ్రామస్తులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని, తన తండ్రి కూడా ఒకప్పుడు సర్పంచ్‌గా పనిచేసినట్లు ఆత్మ సింగ్ అన్నారు. కాగా గురుదాస్‌పూర్ జిల్లాలో దాదాపు 350 ఎకరాల పంచాయితీ భూమి ఉన్న అతిపెద్ద గ్రామాలలో ఒకటైన హర్దోవల్ కలాన్‌లో మాత్రమే గ్రామ సర్పంచ్‌ను వేలంపాట ఎన్నుకునే ఏకైక గ్రామం కాదు. భటిండాలోని గెహ్రీ బుట్టార్ గ్రామంలో కూడా సర్పంచ్ పదవికి కూడా ఇదే తరహాలో ఇటీవల వేలం ప్రక్రియ జరిగింది. ఆ పదవిని రూ.60 లక్షలకు వేలం వేయగా, ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.

పంజాబ్‌లోని గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 15న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ ఎన్నికలో ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించడాన్ని పలువురు రాజకీయ నేతలు ఖండించారు. కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా వేలాన్ని ఖండిస్తూ, దానికి సహకరించిన వారికి జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇది బహిరంగ అవినీతని, ఇలాంటి వేలం ప్రక్రియకు చెల్లదని ఆయన అన్నారు. రూ. 2 కోట్లు ఆఫర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ బ్యూరోని కోరుతున్నట్లు పంజాబ్ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. కాగా అక్టోబర్ 15న పంజాబ్‌ రాష్ట్రంలోని మొత్తం 13,237 మంది సర్పంచ్‌లు, 83,437 మంది ‘పంచ్‌లకు’ బ్యాలెట్ బాక్సుల ద్వారా పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 4 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. అక్టోబరు 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 7 చివరి తేదీ. ఇక ఓట్లు వేసిన రోజునే లెక్కింపు కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.