Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల కేసులో సంచలనం.. హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

మహిళపై లైంగికదాడి , కిడ్నాప్‌ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు రేవణ్ణను సిట్‌ అరెస్ట్‌ చేసింది. కర్నాటకలో సెక్స్‌ టేపుల వ్యవహారంలో పరారీలో ఉన్న రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ కోసం పోలీసులు మరోసారి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. రేవణ్ణ అరెస్ట్‌తో తమకు సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకొనిపోతుందన్నారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల కేసులో సంచలనం.. హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్
Hd Revanna Arrest
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: May 05, 2024 | 6:54 AM

కర్నాటక సెక్స్‌ స్కాండల్‌ కొత్తమలుపు తిరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను బెంగళూర్‌ సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కిడ్నాప్‌ , లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణను అదుపు లోకి తీసుకున్నారు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. రేవణ్ణను ఇంట్లోంచి బయటకు తీసుకు వస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు ఎంత ప్రశ్నించినా మౌనంగానే ఉన్నారు. అంతకు ముందు రేవణ్ణ ఉండే హోలేనర్సిపూర్‌కు కూడా ఒక పోలీసు బృందం బాధితురాలిని తీసుకొని వెళ్ళింది. దేవగౌడ నివాసం నుంచే రేవన్ణను అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య భవానీ మాత్రమే ఉన్నట్టు సమాచారం.

ఈనెల 29వ తేదీన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలిపై రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ లైంగింక దాడికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రజ్వల్‌ కోసం సిట్‌ ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. అతడు జర్మనీలో ఆశ్రయం తీసుకున్నట్టు గుర్తించారు. బాధితురాలు ఐదేళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేశారు. మూడేళ్ల క్రితం పని మానేశారు.

ప్రజ్వల రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు కర్నాటకలో వైరల్‌ అయ్యాయి. హసన్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు ప్రజ్వల్‌ రేవణ్ణ. తుపాకీతో బెదిరించి ప్రజ్వల్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని , ఆ దారుణాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడని, ఎంపీ క్వార్టర్‌కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపించారు. ఆ ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తోనే రేవణ్ణను అరెస్ట్‌ చేశారని, ఈ వ్యవహారంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు కర్నాటక డిప్యూటీ సీఎం సీఎం డీకే శివకుమార్‌. ఈ కేసులో సిట్‌ లోతుగా దర్యాప్తు చేస్తోందన్నారు.

రేవణ్ణ సహాయకుడైన రాజశేఖర్‌కు చెందిన కళేనల్లిలోని ఫార్మ్‌ హౌస్‌లో ఆ మహిళను నిర్బంధించినట్లు సిట్‌ పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడారు. బెంగళూరుకు తీసుకువచ్చిన తర్వాత ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…