Bali Jatra – Odisha: ‘బలి జాత్ర’, ఇండోనేషియాకు పురాతన సంబంధాలు.. G20 మీట్‌లో కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Bali Jatra - Odisha: ఒడిషా ‘బలి జాత్రా’కు, ఇండోనేషియాకు పురాతన సంబంధాలు ఉన్నాయని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్..
Bali Jatra – Odisha: ఒడిషా ‘బలి జాత్రా’కు, ఇండోనేషియాకు పురాతన సంబంధాలు ఉన్నాయని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. బాలి జాత్రా, ఇండోనేషియాకు గల సంబంధాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒడిషా పురాతన సంప్రదాయం ‘బలి జాత్రా’, ఇండోనేషియాతో గల సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘బాలిలో జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. భారత్‌లోని తూర్పు తీరంలో ఒడిశా సాంస్కృతికంగా గొప్ప రాష్ట్రంగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతీ ఏటా బలి జాత్ర జరుపుకుంటారు. బలి జాత్ర, ఇండోనేషియా మధ్య శతాబ్ధాల నాటి సముద్ర వాణిజ్య సంబంధాలకు సంబంధించిన పండుగ.’ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
‘ముఖ్యంగా, పూర్వపు కళింగ సామ్రాజ్యం, ఇండోనేషియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశనం 8వ శతాబ్దం వరకు చాలా బలంగా ఉన్నాయి. కళింగ నావికులు (సాధబాలు) తిరోగమన ఋతుపవనాలను సద్వినియోగం చేసుకొని ఇండోనేషియాకు ముఖ్యంగా బాలికి పడవల ద్వారా వెళ్ళేవారు. నవంబర్ మధ్యలో ఒడిశా నుండి నావికులు బయలుదేరితే, జనవరి మధ్య నాటికి జావా/బాలీ దీవులకు చేరుకుంటారని అంచనా. మార్చి మధ్యలో స్వదేశీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వ్యాపారాన్ని నిర్వహించడానికి వారికి ఇప్పుడు రెండు నెలల సమయం ఉంటుంది.’ అని ప్రముఖ సిద్ధాంతకర్త, రచయిత సంజీవ్ సన్యాల్ తన పుస్తకం ది ఓషన్ ఆఫ్ చర్న్‌లో ఈ విశేషాలన్నీ రాశారు.
ప్రస్తుత ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కళింగులు మంచి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించారు. ఈ శతాబ్దాల వాణిజ్య సంబంధాలు కళింగ, ఇండోనేషియాలోని వ్యాపారులు, పాలకుల మధ్య మైత్రిని సుస్థిరం చేశాయి. ఎంతగా అంటే.. జావా, బాలి ద్వీపాల పేర్లు ఒడియా రాజుల పేర్ల వలన వచ్చాయని చెబుతారు.
అయితే, అనేక శతాబ్దాల క్రితం సముద్రం ద్వారా వ్యాపారాలు సాగించే ఒడిశా నావికులకు వీడ్కోలు పలికేందుకు ప్రతీకాత్మక స్మారకార్థం బలి జాత్రను నిర్వహించేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒడిశాలోని తీర ప్రాంతాలలో బలిజాత్రను నిర్వహించుకుంటున్నారు. అయితే, కోవిడ్ ఆంక్షల కారణంగా రెండేళ్ల పాటు ఈ జాతర నిలిచిపోయింది. ఈ సంవత్సరం అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో నవంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కటక్ నగరంలోని మహానది ఒడ్డున ప్రసిద్ద బలి జాత్రను నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..