AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh: అమృత్‌పాల్ రైట్‌హ్యాండ్ అరెస్ట్.. ఏప్రిల్ 14 వరకు పోలీసుల సెలవులు రద్దు.. హైఅలర్ట్..

సిక్కు మతబోధకుడు, ఖలిస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్‌ సింగ్‌ అన్వేషణలో పంజాబ్‌ పోలీసులు పురోగతిని సాధించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కి అత్యంత సన్నిహితుడు.. సహచరుడు పప్పల్‌ ప్రీత్‌ సింగ్‌ని హోషియార్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌ ఢిల్లీ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో పప్పల్‌ప్రీత్‌సింగ్‌ పట్టుబడ్డాడు.

Amritpal Singh: అమృత్‌పాల్ రైట్‌హ్యాండ్ అరెస్ట్.. ఏప్రిల్ 14 వరకు పోలీసుల సెలవులు రద్దు.. హైఅలర్ట్..
Amritpal Singh
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2023 | 8:16 AM

Share

సిక్కు మతబోధకుడు, ఖలిస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్‌ సింగ్‌ అన్వేషణలో పంజాబ్‌ పోలీసులు పురోగతిని సాధించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కి అత్యంత సన్నిహితుడు.. సహచరుడు పప్పల్‌ ప్రీత్‌ సింగ్‌ని హోషియార్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌ ఢిల్లీ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో పప్పల్‌ప్రీత్‌సింగ్‌ పట్టుబడ్డాడు. పంజాబ్‌ లోని హోషియార్‌పూర్‌లో పప్పల్‌ప్రీత్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అమృత్ పాల్ సింగ్ కు మెంటార్ గా భావిస్తున్న పప్పల్ ప్రీత్ కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. అంతేకాదు.. ఖలిస్తానీ వేర్పాటు వాద ఉద్యమాన్ని లీడ్‌ చేయాల్సిందిగా అమృత్‌పాల్‌ను గైడ్‌ చేసింది కూడా పప్పల్‌ ప్రీత్‌ సింగేనని పోలీసులు భావిస్తున్నారు. జలంధర్‌ నుంచి అమృత్‌పాల్‌ పారిపోయిన సమయంలో ఆయన వెంటే ఉన్నారు పప్పల్‌ప్రీత్‌సింగ్‌. పప్పల్‌ ప్రీత్‌ సింగ్‌ అరెస్టుతో అమృత్‌పాల్‌ ఆటలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్టేనని భావిస్తున్నారు అధికారులు.

పంజాబ్‌ పోలీసులతో పాటు ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలను గత 20 రోజులుగా అమృత్‌ పాల్‌ సింగ్‌ ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. రోజుకో వేషం వేస్తూ.. పోలీసుల కన్నుగప్పి తప్పించుకుతిరుగుతున్నాడు. అయితే ఈ నెల 14న సిక్కుల భేటీకి అమృత్‌పాల్ పిలుపునివ్వడంతో పంజాబ్‌ పోలీసులు దూకుడు పెంచారు. సెర్చింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశారు. పప్పల్‌ ప్రీత్‌ సింగ్‌ అరెస్టుతో పంజాబ్‌ పోలీసుల ఆపరేషన్‌లో కాస్త పురోగతి లభించినట్టయ్యింది. సర్బత్ ఖల్సా నిర్వహణకు అకాల్ తఖ్త్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో .. ఏప్రిల్ 14 వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేశారు. సెర్చ్ ఆపరేషన్‌ ముమ్మరం చేసిన పంజాబ్ పోలీసులు.. మరో మూడు రోజుల్లో ఏప్రిల్ 14న అమృత్‌పాల్‌ ఎలాగైనా పట్టుకోవాలని యోచిస్తున్నారు.

అయితే, అమృత్‌పాల్‌ సింగ్‌ ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్లు పలువురు పేర్కొంటున్నారు. నేపాల్ లో ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో నేపాల్ లో సైతం పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దుల్లో గస్తీని పెంచారు. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ మార్చి18 నుంచి పోలీసుల కన్నుగప్పి తప్పించుకుతిరుగుతున్నాడు. అమృత్‌ పాల్‌ పై హత్యాయత్నం కేసు సహా, విద్వేషాలు రగల్చడం, పోలీసులపైదాడి, ప్రభుత్వోద్యోగులకు అడ్డంకులు సృష్టించడం లాంటి పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అతడి అనుచరులపై సైతం కేసులున్నాయి. వీరికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా పాపల్‌ ప్రీత్‌ సింగ్‌ అరెస్టుతో ఈ కేసులో పురోగతి సాధించినట్టు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..