Amit Shah: మావోయిస్టుల శకం ఇక ముగిసినట్టేనా..? సోమవారం ఆ రాష్ట్రాల సీఎంలతో కేంద్రం కీలక భేటీ..

"తుపాకీతో రాజ్యాధికారం సాధించాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి. సమ సమాజాన్ని స్థాపించాలి" వామపక్ష అతివాద, తీవ్రవాద గ్రూపుల (నక్సలైట్ల) లక్ష్యం, ఉద్దేశం కాస్త అటూఇటుగా ఇదే ఉంటుంది. ఉద్దేశం మంచిదే, కానీ వారు ఎంచుకున్న మార్గమే సరైంది కాదు అంటూ వామపక్ష మేధావులు సైతం చెబుతుంటారు. ఇవన్నీ పక్కనపెడితే ప్రజాస్వామ్య దేశంలో..

Amit Shah: మావోయిస్టుల శకం ఇక ముగిసినట్టేనా..? సోమవారం ఆ రాష్ట్రాల సీఎంలతో కేంద్రం కీలక భేటీ..
Amit Shah
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 06, 2024 | 10:38 AM

“తుపాకీతో రాజ్యాధికారం సాధించాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి. సమ సమాజాన్ని స్థాపించాలి” వామపక్ష అతివాద, తీవ్రవాద గ్రూపుల (నక్సలైట్ల) లక్ష్యం, ఉద్దేశం కాస్త అటూఇటుగా ఇదే ఉంటుంది. ఉద్దేశం మంచిదే, కానీ వారు ఎంచుకున్న మార్గమే సరైంది కాదు అంటూ వామపక్ష మేధావులు సైతం చెబుతుంటారు. ఇవన్నీ పక్కనపెడితే ప్రజాస్వామ్య దేశంలో హింసామార్గాన్ని అనుసరించడం చట్టరీత్యా నేరం. ఈ క్రమంలో పోలీసులు, భద్రతాబలగాలు, పాలకులు, ప్రభుత్వాధికారులను తమ వర్గ శత్రువులుగా భావిస్తూ.. వారిపై తుపాకీ ఎక్కుపెట్టడం మరింత పెద్ద నేరం. ఇవన్నీ తెలిసినా.. కొన్ని దశాబ్దాల క్రితం వరకు అనేక మంది మేధావులు సైతం ఈ మార్గాన్ని అనుసరించారు. దట్టమైన అడవులను తమ స్థావరంగా మార్చుకుని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించారు. ప్రభుత్వాలు చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో ఏకంగా సమాంతర పాలన అందించారు. ఈ క్రమంలో వారిని ఎదుర్కోడానికి వచ్చిన పోలీసు బలగాలపై విరుచుకుపడి మారణహోమం సృష్టించారు. అటవీ ప్రాంతంలో తిరుగుతూ గెరిల్లా యుద్ధ తంత్రాలతో విరుచుకుపడే వివిధ నక్సలైట్ గ్రూపులను సాధారణ పోలీసు బలగాలే కాదు, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర పారామిలటరీ బలగాలు సైతం ఎదుర్కోలేకపోయాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష తీవ్రవాదం (Left Wing Extremism – LWE) ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాయి.

అనేక రాష్ట్రాల్లో విస్తరించిన ‘రెడ్ కారిడార్’

పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ ప్రాంతంలో పుట్టిన ఈ సాయుధ పోరాటాన్ని ‘నక్సలిజం’గా పేర్కొంటూ వచ్చారు. కమ్యూనిస్టుల్లోని అతివాదులు, తీవ్రవాదులు ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) – CPI(ML) పేరుతో పీపుల్స్‌వార్, ప్రతిఘటన, జనశక్తి, ప్రజాప్రతిఘటన.. ఇలా అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. పీపుల్స్‌వార్ బలమైన గ్రూపుగా కొనసాగగా.. మిగతా చిన్న చిన్న గ్రూపులు అంతమవడం లేదా పీపుల్స్‌వార్‌లో విలీనమైపోవడం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI), సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ గ్రూపు ఒక్కటై సీపీఐ(మావోయిస్ట్) గ్రూపుగా అవతరించింది. అప్పటి నుంచి నక్సలైట్లను మావోయిస్టులుగా పిలవడం ప్రారంభమైంది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులు, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యం, తూర్పు కనుమలు అడవుల్లో మంచి గట్టి పట్టు సాధించిన వామపక్ష తీవ్రవాదం.. ఈ ప్రాంతాన్ని ‘రెడ్ కారిడార్‌’గా ప్రకటించుకుంది. ఆయుధాలు చేతబట్టి అడవిబాటపట్టిన వారిలో తెలుగు రాష్ట్రాల మేధావులదే అగ్రస్థానం.

ఆంధ్రప్రదేశ్ నుంచే ఆరంభం

నక్సలిజం పట్ల ఆకర్షితులై హింసామార్గాన్ని ఎంచుకున్న మేధావుల విషయంలోనే కాదు.. పాలకులకు ముప్పుగా మారిన ఈ నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో కూడా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందంజలో నిలిచింది. అటవీ యుద్ధతంత్రాలను ఎదుర్కోనేలా ‘గ్రేహౌండ్స్’ వంటి ప్రత్యేక కమెండో బలగాలను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. అదే సమయంలో తమ నిఘా విభాగాలను సైతం మరింత పటిష్టం చేసింది. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్, గ్రేహౌండ్స్ బలగాలు సమన్వయంతో జరిపిన కౌంటర్ ఆపరేషన్లతో అనేక మంది నక్సలైట్లను అంతం చేస్తూ మిగతా దేశానికి మార్గం నిర్దేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినా సరే.. మావోయిస్టులపై అనుసరించే వైఖరిలో తేడా ఏమీ రాలేదు. తెలుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు సూచిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైతం తెలుగు రాష్ట్రాల మాదిరిగా కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF)లో గ్రేహౌండ్స్ తరహాలో ‘కోబ్రా’ బెటాలియన్లను రూపొందించి ఆయా రాష్ట్రాలకు పంపించింది. వాటి సాయంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలు ప్రస్తుతం మావోయిస్టులపై పోరు సాగిస్తున్నాయి. మొదట్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని, భారీ ప్రాణనష్టాలను చవిచూసిన కౌంటర్ ఆపరేషన్లు.. చివరకు విజయం సాధించాయి. గత కొన్నేళ్లలో మావోయిస్టులు ఈ కౌంటర్ ఆపరేషన్లలో తీవ్రంగా నష్టపోయారు.

కేంద్రం బహుముఖ వ్యూహం

వామపక్ష తీవ్రవాదాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూస్తే ప్రయోజనం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. మావోయిస్టులను ఎదుర్కోవడం రాష్ట్రాలకు అవసరమైన సుశిక్షిత కేంద్ర బలగాలను అందించడంతో పాటు.. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ వచ్చింది. వెనుకబాటుతనం, ప్రజాస్వామ్య పాలన చేరుకోలేని మారుమూల అటవీ ప్రాంతాలే మావోయిస్టులకు కంచుకోటలుగా మారుతున్నాయని గ్రహించి ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్ టవర్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు నిర్మిస్తూ… సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అక్కడి ప్రజలకు చేరేలా చేస్తూ బాహ్య ప్రపంచంతో కలిసేలా చేసింది. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రయత్నం చివరకు ఫలించే దశకు చేరుకుంది.

సోమవారం కీలక సమావేశం

వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రతియేటా ఆయా రాష్ట్రాలతో కేంద్రం సమావేశమవుతూ లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం (అక్టోబర్ 7) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారమే ఢిల్లీ చేరుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ కీలక సమీక్షలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ఉన్నతాధికారులు, CRPF, ITBP, BSF, SSB వంటి కేంద్ర బలగాల అధిపతులు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తదితరులు పాల్గొననున్నారు. గత ఏడాది అక్టోబర్ 6న నిర్వహించిన సమావేశంలో మార్చి 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ క్రమంలో ఏ మేరకు పురోగతి సాధించామన్నది సోమవారం సమీక్షించే అవకాశం ఉంది.

చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ పై..

తాజాగా చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ గురించి కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. తాజా గణాంకాల ప్రకారం 2010తో పోల్చితే మావోయిస్టు హింస 72% మేర తగ్గిందని, మావోయిస్టుల హింస కారణంగా చనిపోయినవారి సంఖ్య కూడా 86% తగ్గిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 723 మంది మావోయిస్టులు లొంగిపోగా.. పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లలో 202 మంది మావోయిస్టుల హతమయ్యారు. మరో 812 మంది అరెస్టయ్యారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం 38కి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కి.మీ పొడవైన రోడ్లతో పాటు 6,000 మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..