Haridwar: హరిద్వార్ లో రష్యన్ల పూజలు.. యుద్ధం ఆగిపోవాలంటూ గంగా నదికి ప్రార్థనలు..
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుతూ.. రష్యాకు చెందిన పలువురు హరిద్వార్ లో పూజలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన 24..

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుతూ.. రష్యాకు చెందిన పలువురు హరిద్వార్ లో పూజలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన 24 మంది రష్యన్ల బృందం హరిద్వార్ చేరుకుని కంఖాల్‌లోని రాజ్‌ఘాట్‌లో గంగాపూజ నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం గంగను పూజించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు. వీరు గత కొద్ది రోజులుగా హరిద్వార్, రిషికేశ్‌లలో నివసిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు కాబట్టి రెండు దేశాల పౌరులు కూడా యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు తమ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించే 24 మంది రష్యా నుండి హరిద్వార్ చేరుకున్నారు. వారికి పవిత్ర గంగానదిపై అచంచల విశ్వాసం ఉంది. దీంతో తమ కోరికలు ఫలించాలని కోరుకుంటూ పూజలు చేశారని బృందం నాయకుడు ఒకరు తెలిపారు.
కాగా.. రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తయింది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కాలంలో జరిగిన యుద్ధంలో ఎంతో మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లో ఆస్తినష్టం పెద్దయెత్తున జరిగింది. పాఠశాలలు, ఆస్పత్రులు అనే తేడా లేకుండా రష్యా సేనలు దాడులు చేయడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా సేనలు స్వాధీనం చేసుకోవం, తిరిగి ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు.
యుద్ధం ప్రభావం ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావ చూపింది. వస్తువుల ధరలు పెరిగాయి. ప్రధానంగా గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతుండటంతో వీటి ధరలు పెరిగాయి. యుద్ధం కారణంగా 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని చెబుతన్నారు. 7199 మంది పౌరులు మరణించారు. 11,756 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..