Onion Farmer: 512 కిలోల ఉల్లిగడ్డకు రూ.2.. చెక్కు చూసి కన్నీళ్లు పెట్టుకున్న అన్నదాత.. అంతే కాకుండా..
రైతులు దేశానికి వెన్నెముక.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. ఇలాంటి నినాదాలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కాయా కష్టం చేసి...
రైతులు దేశానికి వెన్నెముక.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. ఇలాంటి నినాదాలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కాయా కష్టం చేసి పంట పండిస్తే.. తీరా పంట చేతికొచ్చినా తర్వాత సరైన గిట్టుబాటు ధర లేక, డిమాండ్ లేక, మార్కెట్ లేక.. కడగండ్లే మిగులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలే మార్కెట్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నా కొందరి మధ్యవర్తిత్వం కారణంగా వాటి ఫలాలు అన్నదాతలకు చేరడం లేదు. ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తాజాగా మహారాష్ట్రలోని షోలాపుర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. 512 కిలోల ఉల్లిగడ్డలకు కేవలం రూ.2 మాత్రమే ఇచ్చారు. అదీ చెక్కు రూపంలో ఇవ్వడం గమనార్హం. మహారాష్ట్ర లోని షోలాపూర్ జిల్లాకు చెందిన రాజేంద్ర చవాన్.. ఉల్లిపంట వేశాడు. పంట చేతికొచ్చింది. సరకును అమ్ముకునేందుకు ఫిబ్రవరి 17న బస్తాల్లో వేసి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ మార్కెట్కు తీసుకెళ్లాడు. సరకును తూకం వేయగా 512 కిలోలు ఉంది.
ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో రాజేంద్ర చవాన్ తీసుకెళ్లిన ఉల్లిపాయలను కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. దీంతో కంగుతిన్న చవాన్.. చేసేదేమీ లేక వ్యాపారుల మాటను అంగీకరించాడు. 512 కిలోల ఉల్లిపాయలకు రూ.512లు చెల్లించారు. అందులో రవాణా, కూలీల ఖర్చు, తూకం ఛార్జ్ అన్నీ కలిపి రూ.503.51 అయింది. అన్నీ పోగా చివరికి 2 రూపాయల 49 పైసలు మిగిలింది. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసి రూ.2లకు ఆ రైతుకు మార్కెట్ యార్డు వ్యాపారులు చెక్ ఇవ్వడం గమనార్హం. ఈ రశీదుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇన్సిడెంట్ పై నెటిజెన్లు మండిపడుతున్నారు.
నేను 512 కిలోల ఉల్లిపాయలను మార్కెట్ కు తీసుకువచ్చాను. కిలోకు ఒక రూపాయి చెల్లిస్తామని వ్యాపారులు చెప్పారు. ఇలా నాకు రూ.512 వచ్చాయి. రవాణా ఛార్జీలు, హెడ్‌లోడింగ్, తూకం పేరుతో రూ. 509.51 తీసుకున్నారు. దీంతో నాకు రూ.2.49 మిగిలింది.
– రాజేంద్ర చవాన్, బాధిత రైతు
ఈ ఘటనపై స్పందించిన వ్యాపారులు.. మార్కెట్ కు తీసుకువచ్చిన ఉల్లిపాయలు నాణ్యత తక్కువగా ఉన్నాయన్నారు. ఇంతకుముందు చవాన్ కిలో రూ.18కి విక్రయించే నాణ్యమైన ఉల్లిని తీసుకొచ్చాడని, ఆ తర్వాత మరో బ్యాచ్ పంటకు రూ.14 పలికిందన్నారు. నాణ్యత లేని ఉల్లిపాయలకు డిమాండ్ తో పాటు ధర కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..