AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 ఏళ్లకే మోకాళ్ల నొప్పి వస్తోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!

ఒకప్పుడు మోకాళ్ల నొప్పి, కీళ్ల బిగుతు, నడవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ప్రధానంగా వృద్ధాప్యంలోనే కనిపించేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో కూడా మోకాళ్ల నొప్పి సాధారణ సమస్యగా మారుతోంది. ఈ సమస్య రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపడమే కాకుండా భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

25 ఏళ్లకే మోకాళ్ల నొప్పి వస్తోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త!
Knee Pain In Young Adults
Srilakshmi C
|

Updated on: Jun 02, 2026 | 9:09 PM

Share

ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ నవల్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం.. మోకాలు శరీరంలో అత్యంత కీలకమైన కీళ్లలో ఒకటి. నడవడం, పరుగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం వంటి ప్రతి కదలికలో మోకాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువ సమయం కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల మోకాల చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడతాయి. దీంతో మోకాలిపై అదనపు ఒత్తిడి పడుతూ క్రమంగా మృదులాస్థి దెబ్బతింటుంది.

ప్రధాన కారణాలు ఇవే

డెస్క్ జాబ్‌ల కారణంగా గంటల తరబడి కూర్చోవడం యువతలో మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణంగా మారింది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల రక్తప్రసరణ తగ్గి కీళ్ల కదలిక మందగిస్తుంది. అలాగే అధిక బరువు కూడా మోకాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి అదనపు కిలో బరువు మోకాలపై మరింత ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, మోకాలిలో ఉండే మృదులాస్థి నెమ్మదిగా క్షీణించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, కాలక్రమేణా ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు నొప్పి రావడం, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కీళ్లు బిగుసుకుపోవడం, మోకాలిలో వాపు, నడిచేటప్పుడు శబ్దం వినిపించడం, వ్యాయామం చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

ఇవి కూడా చదవండి

మోకాల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి 40 నుంచి 45 నిమిషాలకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవాలి. నడక, సైక్లింగ్, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు మోకాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం.

చిన్న వయస్సులోనే మోకాళ్ల నొప్పి వస్తే దాన్ని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us