AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..

హైదరాబాద్‌లోని మియాపూర్ మయూరి నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ప్రణవి అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడిపోయి మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫోన్‌లో మాట్లాడుతుండగా పిట్టగోడపై కూర్చున్న ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కిందపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రణవి ప్రాణం తీసిన ఫోన్..! పిట్ట గోడపై కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా..
Hyderabad apartment accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 9:00 AM

Share

హైదరాబాద్‌ మియాపూర్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. మయూరి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 20 ఏళ్ల యువతి ప్రణవి ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రణవి అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోని పిట్టగోడపై కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్‌లో ఉండగా ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి ఒక్కసారిగా జారి కిందపడినట్లు పేర్కొంటున్నారు.. అయితే ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే భారీ శబ్దం వినిపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చి చూడగా యువతి తీవ్ర గాయాలతో నేలపై పడిఉన్నట్లు గుర్తించారు. తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రణవిని రక్షించేందుకు ప్రయత్నించారు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక పోలీసు బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువతి ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రణవి ఫోన్ కాల్ డేటా, ఆమె చివరి క్షణాల్లో ఎవరితో మాట్లాడిందనే వివరాలను సేకరిస్తున్నారు. అలాగే అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆమె పడిపోయిన సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు..> ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే అనుమానిస్తున్నప్పటికీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరోవైపు ఈ ఘటనపై స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లలో పిట్టగోడలు, ఓపెన్ ఏరియాలు ఉన్న చోట భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ దుర్ఘటనతో మయూరి నగర్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఒక యువతి ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us