Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రాబోయే మూడ్రోజుల పాటు కుండపోత వానలు కొనసాగనున్నాయి. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతోది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన నైరుతి తెలంగాణను తాకినప్పటికీ.. నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి.
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇక ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది. జూన్ 23న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా.. జూన్ 24న వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశముందని స్పష్టం చేసింది.
ఏపీలో భారీ వర్షాలు
ఇక ద్రోణి ప్రభావంతో జూన్ 23న ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. ఇక గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో వానలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
