Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్ టెక్నిక్‌తో మీ చర్మం మెరిసిపోవడం పక్కా!
డీటాక్స్ అంటే తెలుసు కదా! మనల్ని టాక్సిక్(విషపూరితం) చేసే వాటి నుంచి కొంతకాలం దూరంగా ఉండడమే డీటాక్స్. ఈ మధ్య కాలంలో మొబైల్స్‌ను దూరం పెట్టే ‘డిజిటల్ డీటాక్స్’ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మరో డీటాక్స్ ట్రెండ్ నడుస్తుంది. అదే స్కిన్ డీటాక్స్. ఇదెలా ఉంటుందంటే..

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం రెగ్యులర్‌గా వాడే అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దూరంగా ఉండడమే స్కిన్ డీటాక్స్ లేదా స్కిన్ ఫాస్టింగ్. ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం చాలామంది ఫేస్‌కి ఏదో ఒక క్రీములు పూస్తుంటారు. కనీసం పౌడర్, సబ్బు అయినా అప్లై చేస్తారు. ఇవన్నీ కెమికల్స్‌తో నిండి ఉంటాయి. కాబట్టి కొంతకాలం వీటినుంచి చర్మానికి రెస్ట్ ఇవ్వడమే ఈ స్కిన్ ఫాస్టింగ్. ఈ ట్రెండ్ జపాన్‌లో చాలా పాపులర్. ‘లెస్ ఈజ్ మోర్’ అనే కాన్సెప్ట్ నుంచి ఈ ట్రెండ్ పుట్టింది.
ఇలా చేయాలి
మామూలుగా ఉపవాసం ఎలా చేస్తారో స్కిన్ ఫాస్టింగ్ కూడా అలాగే చేయాలి. చర్మానికి ఎలాంటి సప్లిమెంట్స్ అప్లై చేయకూడదు. ఆఖరికి ఫేస్ వాష్‌లు, సబ్బులు కూడా వాడకూడదు. దానికి బదులు నేచురల్‌గా దొరికే పసుపు, చందనం, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లాంటివి వాడొచ్చు. అలాగే చాలామంది బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ లోషన్ వాడుతుంటారు. స్కిన్ ఫాస్టింగ్‌లో దాన్ని కూడా పక్కన పెట్టాల్సిందే. అవసరమైతే ఆ వారం రోజులు ఎండ ఎక్కువ తగలకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది.
స్కిన్ ఫాస్టింగ్ కనీసం వారం రోజుల పాటు, ప్రతి రెండు నెలలకొకసారి చేయాలి. రెగ్యులర్‌గా మేకప్ వేసుకునే వాళ్లు మాత్రం నెలకొకసారి స్కిన్ ఫాస్టింగ్ చేయాలి. ఈ వారం రోజులు చర్మంపై నీళ్లు, నూనె, నేచురల్ ప్రొడక్ట్స్ తప్ప ఇంకేమీ వాడకూడదు. స్కిన్ ఫాస్టింగ్‌లో ఉన్నన్ని రోజులు ఎక్కువ నీళ్లు తాగాలి. అలాగే ఈ వారం రోజలు చెమటలు పట్టేలా వ్యాయామం కూడా చేయాలి. దీనివల్ల చర్మం పై పొరల్లో పేరుకున్న విషపూరిత రసాయనాలు చర్మం నుంచి బయటకు పోతాయి. అలా స్కిన్ కంప్లీట్‌గా డిటాక్స్ అవుతుంది.
లాభాలివే..
- స్కిన్ ఫాస్టింగ్ వల్ల చర్మం.. రసాయనాల మీద ఆధారపడకుండా ఉండడం అలవాటు పడుతుంది.
- కెమికల్స్‌ను కొద్ది రోజుల పాటు ఆపేయడం వల్ల చర్మం దానంతట అదే నయం చేసుకునే గుణాన్ని పొందుతుంది. కొద్ది రోజుల పాటు చర్మానికి ఎలాంటి క్రీములు వాడకుండా చర్మాన్ని అలాగే నేచురల్ లుక్‌తో మెయింటెయిన్ చేస్తే మరింత అందంగా కూడా కనపడతారు.
- చర్మం మీద ఒక యాసిడ్ లేయర్ ఉంటుంది. దుమ్ము, ధూళి నుంచి ఇది కాపాడుతుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఆ యాసిడ్ పీహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకే స్కిన్ ఫాస్టింగ్ చేస్తే పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
- స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల చర్మంలో నేచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యే సీబమ్ లెవల్ తగ్గిపోతుంది. స్కిన్ ఫాస్టింగ్ వల్ల దాని లెవల్స్‌ను కూడా కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




