Tamil NaduTourism:దేవుడు నిర్మించిన వంతెన.. దేశంలో చిట్టచివరి గ్రామం.. తప్పక వెళ్లాల్సిన టూర్..!
దక్షిణ భారతంలో ప్రముఖ శైవ క్షేత్రం రామేశ్వరానికి సమీపంలో ఉన్న ధనుష్కోడి గ్రామానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఘోస్ట్ టౌన్‌గా పిలవబడిన ఈ ప్రదేశం ఇప్పుడు పర్యాటకులతో సందడిగా మారింది. 1964 తుపాను విపత్తు చరిత్ర ఉన్న ఈ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అందాలు, అక్కడికి చేరుకోవాల్సిన మార్గాల వివరాలు ఇక్కడ చూడండి.

భారతదేశం అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు, సముద్రాలు కనువిందు చేస్తాయి. దక్షిణ భారత్‌లో రెండు సముద్రాల మధ్య ఒక గోడలా ఉన్న గ్రామం పర్యటకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో చిట్టచివరి గ్రామంగా పేరుగాంచిన ఆ ప్రాంతం అందాలు చూసేందుకు భారత్ నుండి, విదేశాల నుండి పర్యటకులు అధిక సంఖ్యలో వస్తారు.
ధనుష్కోడి ప్రత్యేకత
లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఈ గ్రామమే తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న ‘ధనుష్కోడి’. దేశంలో చిట్టచివరి గ్రామంగా దీనికి పేరుంది. ప్రముఖ శైవ క్షేత్రం రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో, పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. భారత్, శ్రీలంకను కలిపే రామ సేతు (ఆడమ్స్ బ్రిడ్జ్) ఈ గ్రామంలోనే ఉంది. రెండు సముద్రాల నడుమ ఉన్న ఈ పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తారు. 2016కు ముందు వరకు ఈ ప్రాంతాన్ని చూసేందుకు సముద్రంలో ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత ప్రభుత్వం రోడ్డు మార్గం నిర్మించింది. దాంతో ఈ ప్రాంతం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించింది.
దీనమైన చరిత్ర
ధనుష్కోడి ప్రాంతానికి ఒక విషాదకర చరిత్ర ఉంది. 1964 డిసెంబర్ 22, 23 తేదీల్లో వచ్చిన భయంకరమైన తుపాను కారణంగా ధనుష్కోడి పట్టణం పూర్తిగా మునిగిపోయింది. ఈ విపత్తులో గ్రామంలోని దాదాపు 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక రైలు కూడా సముద్రంలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఈ ప్రదేశాన్ని ఘోస్ట్ టౌన్ గా పిలిచారు. తర్వాతి కాలంలో పర్యటకుల కోసం ఈ పట్టణాన్ని తిరిగి నిర్మించారు. ఇటీవలికాలంలో ధనుష్కోడికి పర్యటకుల తాకిడి పెరిగింది.
బీచ్ అందాలు, సందర్శన సమయం
ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం మధ్యలో ఈ చిన్న గ్రామం ఉంటుంది. ఇక్కడి బీచ్ అందాలు అద్భుతంగా ఉంటాయి. పర్యటకులు ఎక్కువగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ పర్యాటక ప్రాంతానికి వస్తుంటారు. రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నాక అనేక మంది ఇక్కడికి వస్తారు.
ఎలా చేరుకోవాలి?
రామేశ్వరం నుంచి రోడ్డు మార్గంలో కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ పర్యాటక ప్రాంతం ఉంది.
తెలుగు రాష్ట్రాల నుండి: తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరం చేరుకుని, అక్కడి నుంచి ధనుష్కోడికి వెళ్లవచ్చు.
హైదరాబాద్ నుండి: హైదరాబాద్ నుండి రామేశ్వరం దూరం దాదాపు 1200 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడకు రైలు లేదా విమాన మార్గంలో వెళ్లవచ్చు.
రోడ్డు మార్గం: హైదరాబాద్ నుంచి కర్నూలు, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై, ఆ తర్వాత రామేశ్వరం (NH44, NH38) చేరుకోవచ్చు.
రైలు మార్గం: కాచిగూడ నుండి డైరెక్ట్ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు ఐఆర్‌సీటీసీ యాప్ (IRCTC App) లో చూడవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు.




