Sleep Tourism: విశ్రాంతి, నిద్ర కోసం ట్రావెల్.. నవ్వకండి ఇట్స్ సీరియస్ మ్యాటర్..!
ఈ రోజుల్లో స్లీప్ టూరిజం అనే కొత్త ట్రెండ్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఎక్కువ ఒత్తిడితో నడిచే జీవితంలో చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం ప్రత్యేకంగా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. అవును ఇప్పుడు కొత్త ప్రదేశాలను చూడటానికి కాకుండా నిద్ర పూర్తిగా పొందేందుకు పర్యటనలు జరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది..? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి..? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం స్లీప్ టూరిజం అనే కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. సాధారణంగా మనం టూరిజం అనగానే కొత్త ప్రదేశాలు చూడడం, సాహసాలు చేయడం లేదా ప్రకృతి అందాలను ఆస్వాదించడం అనుకుంటాం. అయితే స్లీప్ టూరిజం అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడమే ప్రధాన ఉద్దేశం. వారమంతా కష్టపడి పని చేసిన వాళ్ళు తమకి ప్రశాంతత అవసరమని భావించే వాళ్ళు వీకెండ్‌లో స్లీప్ టూరిజానికి వెళ్తున్నారు. ఇది పూర్తిగా విభిన్నమైన ట్రెండ్, కొత్తగా పుట్టుకొస్తున్న మార్పు.
కొంతమంది నగరాల్లో ఉండే హడావిడి పని ఒత్తిడి వల్ల తరచూ తక్కువ నిద్రపోతుంటారు. వారాంతంలో ఈ ఒత్తిడికి చెక్ పెట్టేందుకు నిద్రలో కొంత సమయం గడపాలని శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలని భావిస్తారు. అందుకే వారు పర్యటనల కోసం ప్రయాణం చేస్తారు. కానీ అక్కడ ఏదైనా సాహసాలు చేయడానికి కాదు. కేవలం నిద్రపోవడానికే ప్రయాణం చేస్తారు. ఇక్కడి విశేషం ఏమిటంటే వారు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లేదా కొత్త ప్రదేశాలు చూడడానికి కాకుండా ప్రశాంతత కోసం మాత్రమే ఈ ప్రయాణం చేస్తారు.
సాధారణంగా టూరిజం అంటే కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు అనిపిస్తాయి. కానీ స్లీప్ టూరిజం ఇందుకు విభిన్నం. రోజువారీ హడావిడి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు అన్నీ కలిపి నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ప్రశాంత వాతావరణంలో కాసేపు పర్యటనకు వెళ్లి అక్కడ కేవలం విశ్రాంతిని పొందడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.
చాలామంది వారమంతా తక్కువ నిద్రపోతారు. వారాంతంలో మాత్రం ఎక్కువగా నిద్రపోయి కోలుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ వైద్య నిపుణులు ఇది ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పడంలేదు. ప్రతి రోజూ సరైన నిద్ర అవసరం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరైన నిద్రపోతేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వారాంతంలో ఎక్కువ నిద్రపోవడం ద్వారా మన శరీరం ఆ తక్కువ నిద్రకు పూర్తి పరిహారం పొందదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ స్లీప్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక నిద్రలేమి ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, రాత్రిపూట పనిచేయడం వంటి కారణాలతో భారతీయ యువతలో నిద్రలేమి పెరుగుతోంది.
చాలామంది ప్రతిరోజూ తగినంత సమయం నిద్ర కోసం కేటాయించడం లేదు. ముఖ్యంగా యువతలో రాత్రి ఆలస్యంగా నిద్రపోయి తెల్లవారుజామున మేల్కొంటున్నారు. కానీ వైద్యులు చెబుతున్నది ఏమిటంటే క్రమం తప్పకుండా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రమే శరీరానికి, మనసుకు ఆరోగ్యకరంగా ఉంటుంది.