Papikondalu Tour: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలైన గోదావరి అలలపై పాపికొండల షికారు
ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను మళ్ళీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం మళ్లీ మొదలైంది. గోదావరికి వరదలు తగ్గడంతో పాపికొండల విహార యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతిచ్చింది. దీంతో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం నేటి నుంచి మొదలయ్యింది. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం నుండి పాపికొండలు విహార యాత్రను నేటి నుండి అధికారులు ప్రారంభించారు. అయితే ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను మళ్ళీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు ప్రభుత్వ బోట్లలో సుమారు 100 మంది పర్యాటకులను సేఫ్టీ ప్రికాషన్ తో పాపికొండల తీరం దర్శించడానికి పయనం అయ్యాయి. అధికారులు పర్యవేక్షణ లో పర్యాటకులు పయనం అయ్యారు. దీంతో గండిపోచమ్మ బోట్ పాయింట్ వద్ద మళ్ళీ పర్యటక సందడి వాతావరణం నెలకొంది.
అయితే ముందుగా ఈ మేరకు అధికారులు గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు. గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటుచేశారు. పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సంక్రాంతి తర్వాత పాపికొండల యాత్రను నిలిపేసేవారు.. నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేసేవారు. అయితే, పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..