Papikondalu Tour: గుడ్ న్యూస్.. పాపికొండల విహారయాత్రకు గ్రీన్‌సిగ్నల్.. ఏర్పాట్లు చేస్తున్న పర్యాటకశాఖ..
గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం మళ్లీ మొదలవబోతోంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది.

గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం మళ్లీ మొదలవబోతోంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. తాజాగా, పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గోదావరి అలలపై బోటు షికారుకు అంతా సిద్ధమైంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి అందాల నడుమ.. చిన్నా, పెద్దా అందరూ పాపికొండల టూర్ చేసేయొచ్చు. పాపికొండల ప్రయాణంలో పొందే అనుభూతులు అనిర్వచనీయం.. జీవితంలో గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.. ఎన్నో జంతుజాతులు, ఔషధవృక్షాలకు నిలయమది. పాపికొండలు చూపే వర్ణాలకు ప్రకృతి అందాల్లో తిరుగుండదు. దీంతో అలసిన మనసులకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచే పాపికొండల యాత్రకు.. పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే.. గోదావరి వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయింది విహార యాత్ర. ప్రస్తుతం నదిలో నీటిమట్టం తగ్గడంతో బోట్ల రాక పోకలకు పచ్చజెండా ఊపింది పర్యాటక శాఖ. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటుచేశారు పర్యాటక శాఖ అధికారులు. గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు. అంతేకాకుండా పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు.
గోదావరి తగ్గుముఖం పట్టడం, కార్తీకమాసం ప్రారంభం కావడంతో పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యాటకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
