Healthy Street Foods: స్ట్రీట్ ఫుడ్‌లలో వీటి రూటు సెపరేటు..! రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతం
కొందరు వ్యాపారులు లాభాలకు కక్కుర్తిపడి జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. అయితే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్‌లలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మొక్కజొన్న పొత్తులు. అవును.. మనలో చాలా మందికి రోడ్డుపక్కన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తిన్న అనుభవాలు ఉన్నాయి..

కొంతమందికి స్ట్రీట్ ఫుడ్ మహా ఇష్టం. పానీ పూరీ, బజ్జీ, పకోడీ వంటి వివిధ రకాల వేయించిన ఆహారాలు అమ్మే దుకాణాల ముందు భోజన ప్రియులు క్యూ కడుతుంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా.. పెద్దగా పట్టించుకోరు. బదులుగా ప్రతిరోజూ అక్కడికే వెళ్లి రకరకాలుగా స్నాక్స్ తింటుంటారు. కానీ అన్ని వీధి ఆహారాలు చెడ్డవి కాదు. కొందరు వ్యాపారులు లాభాలకు కక్కుర్తిపడి జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. అయితే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్‌లలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మొక్కజొన్న పొత్తులు. అవును.. మనలో చాలా మందికి రోడ్డుపక్కన కాల్చిన మొక్కజొన్న పొత్తులు తిన్న అనుభవాలు ఉన్నాయి. ఇవి రుచిగా ఉండటమేకాకుండా ఆరోగ్యానికి కూడా బోలెడంత మేలు చేస్తాయి. ఈ లిస్టులో మరికొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భేల్ పూరి
స్నాక్స్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు సమోసాలు, కచోరి, బజ్జీ వంటి ఆహారాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇవి శరీరానికి కాదు, నాలుకకు మాత్రమే రుచిగా ఉంటాయి. కానీ వీధిలో పోషకాలను అందించే స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో మొదటిది భేల్ పూరి. దీనికి నూనె వాడకం అవసరం లేదు. రుచికరంగా తయారు చేయవచ్చు. అలాగే ఇందులో ఉపయోగించే పదార్థాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఈ చిరుతిండిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో జోడించిన కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పైగా ఈ చిరుతిండిని చాలా త్వరగా తయారు చేయవచ్చు. అందుకే చాలా మంది పోషకాహార నిపుణులు కూడా భేల్ పూరి తినమని సిఫార్సు చేస్తుంటారు. కానీ దీనిని తినేటప్పుడు సాస్ జోడించకుండా ఉండాలి.
పీనట్‌తో చాట్
చనా చాట్. ఇది చాలా సులభంగా తయారు చేసుకునే స్నాక్. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శనగ పిండితో తయారు చేయబడినందున, ఎలాంటి సందేహం లేకుండా దీనిని తినవచ్చు. టమోటా, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయ, కీరదోస, పచ్చిమిర్చి వంటి పదార్థాలను దీనికి కలుపుతారు. వీటన్నింటినీ కలిపితే పోషకాల సమతుల్యత లభిస్తుంది. ఈ స్నాక్ రుచితోపాటు ఆరోగ్యం రెండింటినీ అందిస్తుంది. అయితే, తినేటప్పుడు కొంచెం నిమ్మరసం జోడించడం ఇంకా మంచిది. ఒకవేళ మీకు అసిడిటీ సమస్యలు ఉంటే, నిమ్మకాయ వేయకపోవడమే మంచిది.
మొక్కజొన్న కంకులు
వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు విస్తృతంగా లభిస్తాయి. వీధుల్లో వీటిని కాల్చి అమ్ముతారు. దీనికి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాల్చినా లేదా ఆవిరి మీద ఉడికించినా ఏ విధంగా తీసుకున్నా మంచిదే.
ఇడ్లీ, ఉడికించిన గుడ్డు
నూనె పదార్థాలు కాకుండా ఇడ్లీలు, ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ టిఫిన్ సెంటర్‌లోనైనా ఇడ్లీలు దొరుకుతాయి. మినపప్పుతో తయారుచేసిన ఇడ్లీలు శరీరానికి ఎటువంటి సమస్యలను కలిగించవు. అంతేకాకుండా వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.