Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్ట్రీట్ స్టైల్ మొక్కజొన్న పకోడీ రెసిపీ.. వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్నాక్.. టేస్ట్ అదిరిపోతుంది..!

వర్షాకాలంలో వేడి వేడి పకోడీ తినాలనిపించని వారు ఉండరు. ముఖ్యంగా తీపి మొక్కజొన్న పకోడీలు అయితే.. అవి కరకరలాడుతూ, కొంచెం కారంగా ఉండి, సాయంత్రం టీ తాగేటప్పుడు చాలా బాగుంటాయి. వీటిని ఇంట్లోనే చాలా తేలికగా, తక్కువ సమయంలో రుచిగా చేసుకోవచ్చు.

స్ట్రీట్ స్టైల్ మొక్కజొన్న పకోడీ రెసిపీ.. వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్నాక్.. టేస్ట్ అదిరిపోతుంది..!
Corn Pakoda Receipe
Prashanthi V
|

Updated on: Jul 06, 2025 | 2:39 PM

Share

తీపి మొక్కజొన్న గింజలు, బేసన్ పిండి, ఉల్లిపాయలతో చేసే మొక్కజొన్న పకోడాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపిస్తుంది. ఈ స్నాక్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ కి మంచి ప్రత్యామ్నాయం. సాధారణంగా ఉల్లిపాయ పకోడాలు బాగా ప్రసిద్ధి. అయితే ఈ మొక్కజొన్న పకోడాలు కూడా ఘాటుగా.. క్రంచీగా ఉంటాయి. ఈ పకోడాలను మసాలా టీ, కాఫీతో స్నాక్‌ గా తినొచ్చు. కొత్తిమీర, పుదీనా, కొబ్బరి చట్నీలతో కలిపి తిన్నా చాలా బాగుంటాయి. మొక్కజొన్న పకోడాలు వేడివేడిగా తింటేనే రుచిగా ఉంటాయి. అవసరమైతే ఓవెన్‌ లో మళ్లీ వేడి చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్ధాలు

  • మొక్కజొన్న గింజలు – 1½ కప్పులు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  • జీలకర్ర – ½ టీస్పూన్
  • బేసన్ పిండి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
  • బియ్యపు పిండి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
  • గరం మసాలా – ½ టీస్పూన్
  • ఉల్లిపాయ – 1 చిన్నది (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • పచ్చిమిర్చి – 2
  • కరివేపాకు లేదా పుదీనా లేదా కొత్తిమీర – 1 నుంచి 2 రెమ్మలు
  • ఉప్పు – ½ టీస్పూన్
  • పసుపు – ¼ టీస్పూన్
  • కారం – ¼ టీస్పూన్
  • ఆయిల్ – సరిపడా

తయారీ విధానం

మొదట మొక్కజొన్న గింజలు సిద్ధం చేసుకోవాలి. కార్న్ కోబ్ ఉపయోగిస్తుంటే.. ముందుగా వాటిని నీటిలో మరిగించి గింజలను జాగ్రత్తగా వేరు చేయండి. ఒకవేళ ఫ్రోజన్ కార్న్ ఉపయోగిస్తుంటే.. వాటిని కడిగిన తర్వాత నీటిని పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. తరువాత సిద్ధం చేసుకున్న మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసి చిన్నగా, కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. గింజలు పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా రుబ్బకూడదు, లేకపోతే వేయించేటప్పుడు మాడిపోవచ్చు.

ఇప్పుడు రుబ్బిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా లేదా కొత్తిమీర లేదా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమంలో బేసన్ పిండి, బియ్యపు పిండి లేదా కార్న్ స్టార్చ్, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసి అన్నీ బాగా కలిసేలా చేతులతో కలపండి. ఈ పిండి మిశ్రమం బ్యాటర్‌ లా కాకుండా.. గట్టిగా ముద్దలా ఉండాలి. ఒకవేళ నీరుగా అనిపిస్తే బేసన్ పిండి బియ్యపు పిండిని సమపాళ్లలో కొద్దిగా కలుపుకోవచ్చు.

ఇలా అన్ని రెడీ చేసుకుని.. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యిందో లేదో చెక్ చేయండి. ఆయిల్ సరైన వేడికి వచ్చిన తర్వాత మిశ్రమం నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని జాగ్రత్తగా వేడి నూనెలో వేయాలి. వేసిన వెంటనే వాటిని కదపకుండా రెండు నిమిషాల వరకు వదిలేయాలి. పకోడాలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. మధ్య మధ్యలో అన్ని వైపులా సమానంగా వేగేలా తిప్పుతూ ఉండండి. వేగిన తర్వాత వాటిని నూనె నుండి తీసి అదనపు నూనె కూడా పోవడానికి పేపర్ టవల్ లో ఉంచండి. ఇలా ఇంట్లోనే ఈ రెసిపీని చేసి వేడివేడి మొక్కజొన్న పకోడాలను మసాలా టీతో లేదా మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించండి.