Hydration Tips: ఆరోగ్యానికి మంచిదని అతిగా నీళ్లు తాగుతున్నారా.. ఈ వ్యాధి రిస్క్ మీకే ఎక్కువ..
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని తరచుగా వింటుంటారు. కానీ ఈ నియమం అందరికీ సరికాదని, అతిగా నీళ్లు తాగితే ప్రాణాంతక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు అధికమైనప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని మనం తరచుగా వింటుంటాం. కానీ ఈ నియమం గుడ్డిగా పాటించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరించారు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెన్నైలోని వీఎస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎలకియ మతిమారన్ తెలిపారు.
సోడియం లోపం, ఇతర ప్రమాదాలు అవసరానికి మించి నీళ్లు తాగితే కిడ్నీలపై అధిక భారం పడుతుంది. కిడ్నీలు గంటకు ఒక లీటరు వరకు మాత్రమే ద్రవాలను బయటకు పంపగలవు. అంతకు మించి నీళ్లు తాగితే, శరీరంలో సోడియం స్థాయిలు పడిపోతాయి. ఈ పరిస్థితిని హైపోనాట్రేమియా అంటారు.
ప్రధాన లక్షణాలు: హైపోనాట్రేమియా వల్ల మొదటగా కడుపు ఉబ్బరం, మగత, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే ఫిట్స్, ఇతర తీవ్రమైన వైద్య సమస్యలు కూడా వస్తాయి.
ఎవరికి ఎక్కువ ప్రమాదం? మారథాన్ అథ్లెట్లు, కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారు, అతిగా నీళ్లు తాగే అలవాటు ఉన్నవారు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం ఎక్కువ.
నీళ్లు ఎప్పుడు తాగాలి? ఒక నియమాన్ని పాటించడం కన్నా, మీ శరీరం చెప్పే మాట వినడమే సరైన మార్గమని డాక్టర్ మతిమారన్ సూచించారు.
దాహం అనిపించినప్పుడు మాత్రమే తాగండి.
మూత్రం రంగు గమనించండి: మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరిపడినంత హైడ్రేటెడ్‌గా ఉందని అర్థం.
ఇతర ద్రవాలను పరిగణనలోకి తీసుకోండి: పండ్లు, కూరగాయలు, సూప్‌లు, కాఫీ, టీ కూడా ద్రవాలను ఇస్తాయి.
వ్యక్తిగత అవసరాలు కీలకం: మీ వయసు, బరువు, మీరు చేసే పని, ఆహారం, వాతావరణం వంటి అంశాలపై నీటి అవసరాలు ఆధారపడి ఉంటాయి.
నిపుణుల సలహాలు మాత్రమే కాకుండా, మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు సరైన పద్ధతిలో హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు.




