Smart Parenting: పిల్లలు తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలంటే.. ఈ అలవాట్లు నేర్పించాల్సిందే..!
పిల్లల బుద్ధి పెరగాలంటే పుట్టుకే కాదు.. సరైన దిశా నిర్దేశం అవసరం. చిన్న నాటి నుంచి సరైన అలవాట్లు, ప్రోత్సాహక వాతావరణం ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, తెలివితేటలు సహజంగా పెరుగుతాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఊహాశక్తి పెరిగేందుకు సరళమైన పద్ధతులు చాలా ఉపయోగపడతాయి.

ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ పిల్లలు తెలివైనవారుగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని. కొందరు దీన్ని పుట్టుకతోనే వచ్చేదని అనుకుంటారు. కానీ నిజానికి సరైన సహాయం, మంచి జీవనశైలి, సానుకూల వాతావరణం ఉంటే పిల్లల మేధస్సును మనం పెంచగలం. పిల్లల భవిష్యత్తును బాగా తీర్చిదిద్దడానికి చిన్న చిన్న అలవాట్లు ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు విసుగు మంచిదే
పిల్లలు అప్పుడప్పుడు విసుగు చెందడం మామూలే. వారి మెదడుకు విశ్రాంతి అవసరం. ఆటలు, స్కూల్ పనులు మాత్రమే కాకుండా.. ఏమీ చేయకుండా ఉండే సమయంలో పిల్లలు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం పొందుతారు. దీని వల్ల వారి ఊహాశక్తి, సమస్యలను పరిష్కరించే నేర్పు పెరుగుతాయి.
పిల్లలను ప్రోత్సహించండి
ఇది ఎందుకు జరుగుతుంది..? మీ అభిప్రాయం ఏంటి..? వంటి ప్రశ్నలు అడగమని పిల్లలను ప్రోత్సహించండి. ఇలాంటి ప్రశ్నలు వారిలో ఉన్న తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతాయి. సమాధానం ఒకే మాటలో ఉండని ప్రశ్నలు (ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు) వారి విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వారికి కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది.
తప్పులు చేయడం సహజం
పిల్లలు తప్పులు చేయడం సహజం. అయితే ఆ తప్పుల నుంచే పాఠాలు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. వారిని తప్పు పట్టకుండా ఈసారి అవ్వలేదు, మళ్ళీ ప్రయత్నిద్దాం అనే విధంగా మాట్లాడండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతుంది.
శారీరక కదలిక
నిరంతరం శారీరక కదలికలు మెదడుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. నడక, ఆటలు, డ్యాన్స్ వంటివి చేయడం వల్ల మెదడులో BDNF అనే ప్రొటీన్ విడుదలవుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. అందుకే పిల్లలను బయట ఆడుకోమని.. చెట్లు ఎక్కమని, స్వేచ్ఛగా ఆడుకునే ఆటలలో పాల్గొనమని ప్రోత్సహించండి.
కథల ప్రభావం
పిల్లలకు కథలు చెబితే వారు మాటల ప్రపంచంలోకి వెళ్తారు. మాట్లాడటం, వినడం, ఊహించడం, సంఘటనలను అర్థం చేసుకోవడం వంటి అనేక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పడుకునే ముందు కథలు చెప్పడం.. వారితో కలిసి కథలు అల్లడం వల్ల వారి మానసిక స్థిరత్వం పెరుగుతుంది.
చదువు
పిల్లలకు పుస్తకాలపై ఆసక్తిని పెంచండి. వారి వయసుకి తగిన కథల పుస్తకాలు, సమాచారం ఇచ్చే పుస్తకాలు, పత్రికలు చదివేందుకు ప్రోత్సహించండి. పిల్లలు చదవడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇది భవిష్యత్తులో వారి మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తుంది.
తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయన్న ఆలోచన సరైంది కాదు. అనుభవాలు, ప్రోత్సాహం, సానుకూల వాతావరణం అన్నీ కలిపి పిల్లల్లో బుద్ధి పెరుగుదలకు బలమైన పునాదిని వేస్తాయి. ఖాళీ సమయం ఇవ్వడం, ఆలోచనలకు స్ఫూర్తిని కలిగించడం, కథల ద్వారా భాషను అభివృద్ధి చేయడం వంటి ఈ చిన్న చిన్న మార్గాల్లో మీ పిల్లలను మంచి ఆలోచనశక్తితో ఎదిగేలా చేయొచ్చు.




