Turmeric: పసుపు ఎక్కువగా తింటే ఏమవుతుంది.? రోజుకు ఎంత తీసుకుంటే మంచిది
పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పసుపును ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పసును ఎక్కువగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వంటింటిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో పసుపు ప్రధానమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ వంటకంలో పసుపు కచ్చితంగా ఉండాల్సిందే. ఆయుర్వేదంపరంగా కూడా పసుపునకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పసుపులో ఎన్నో మంచి గుణాల కారణంగానే పసుపును మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుంటాం. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే ఆరోగ్యానికి మేలు చేసే పసుపు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుందని మీకు తెలుసా.? అతి ఏదైనా అనర్థానికి దారి తీస్తుందన్నది పసుపుకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ పసుపుతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి.? అసలు రోజుకు కొంత పసుపు తీసుకోవడం సరైంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
* పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు అవుతాయి. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
* పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది. కాబట్టి గాయాలు అయిన సమయంలో లేదా ఏదైనా శస్త్రచికిత్స చేసిన సమయంలో రక్తస్రావం సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
* పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీంతో లివర్ పనితీరును దెబ్బతీస్తుంది.
* పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దురద, ఎరుపు దద్దుర్లు, చర్మంపై వాపు వంటివి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఎంత తీసుకోవాలి.?
ఆరోగ్యానికి మంచి చేసే పసుపును మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి రోజుకు కేవలం 500 నుంచి 2000 మిల్లీగ్రాముల పసుపును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతకు మించి తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




