Washing Machine: వాషింగ్ మెషిన్ నుంచి దుర్వాసన వస్తుందా? ఖర్చు లేని చిట్కా..
వాషింగ్ మెషిన్ అనేది ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఒక భాగం. అయితే, కొన్నిసార్లు అందులో నుంచి వచ్చే దుర్వాసన మన దుస్తులకూ అంటుకుని ఇబ్బంది పెడుతుంది. దీనిని వదిలించుకోవడానికి చాలామంది రసాయన ఆధారిత క్లీనర్లను ఉపయోగిస్తారు. కానీ, మన ఇంట్లో దొరికే కేవలం రెండు సాధారణ వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం..

నేడు చాలా ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ప్రతి వారం 3-4 సార్లు దీనిని ఉపయోగిస్తాం. తరచుగా శుభ్రం చేయకపోతే లేదా వాడే నీరు శుభ్రంగా లేకపోతే దీనిలో దుర్వాసన వస్తుంది. ఆ వాసన దుస్తులకు కూడా అంటుకుంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి వాషింగ్ మెషిన్‌ను శుభ్రం చేయడం అవసరం. దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
కావాల్సిన వస్తువులు: పటిక – 1 ముక్క, నిమ్మకాయ తొక్కలు – 4, నీరు – 2 లీటర్లు.
తయారీ విధానం:
ముందుగా, 2 లీటర్ల నీటిని బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, పటికను పొడి చేసి అందులో కలపాలి. నిమ్మకాయ తొక్కలు కూడా అందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు మరిగించాలి. నీరు సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపివేసి, 15 నిమిషాలు మూతపెట్టి అలాగే ఉంచాలి.
ఆ తర్వాత, ఆ ద్రావణాన్ని డిటర్జెంట్ పోసే చోట, మిగిలిన దానిని వాషింగ్ మెషిన్ డ్రమ్ లోపల పోయాలి. డ్రమ్‌లో ఎలాంటి దుస్తులు ఉండకూడదు. మెషిన్‌ను 15-20 నిమిషాల పాటు నడిపించాలి. ఆ నీరు డ్రమ్‌లో ఉన్న మురికిని శుభ్రం చేస్తుంది. ఆ నీరు పూర్తిగా బయటకు వెళ్ళిన తర్వాత, మళ్ళీ 15 నిమిషాలు మంచి నీటితో మెషిన్‌ను నడిపించాలి. పూర్తయిన తర్వాత, మెషిన్‌ను ఆపివేసి, డోర్ తెరిచి గాలి తగిలేలా ఉంచాలి. డ్రమ్ ఆరిపోయిన తర్వాత, దుర్వాసన పూర్తిగా పోతుంది.
ఈ టిప్స్ పాటించండి..
వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం తాజాగా, శుభ్రంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి వాష్ తర్వాత మెషిన్ డోర్‌ను కాసేపు తెరిచి ఉంచాలి. దీనివల్ల లోపల తేమ ఆరిపోయి, దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే, డిటర్జెంట్ కంపార్ట్‌మెంట్‌ను, డోర్ చుట్టూ ఉన్న రబ్బరు గాస్కెట్‌ను తడి గుడ్డతో ఎప్పటికప్పుడు తుడవాలి. నెలకోసారి వెనిగర్ లేదా బేకింగ్ సోడాను వాడి మెషిన్‌ను శుభ్రం చేయాలి. ఇది లోపల పేరుకుపోయిన మురికిని, వాసనను తొలగిస్తుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం కొత్తదిలా ఉంటుంది.




