AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Names: వర్షాలకు పేర్లు ఉన్నాయని తెలుసా..! కురిసే విధానం, సమయాన్ని బట్టి వానల్ని ఏఏ పేర్లతో పిలుస్తారంటే…

ఎండల నుంచి ఉక్కపోతల నుంచి ఉపశమనం ఇస్తూ సమస్త మానవాళికి సంతోషాన్ని కలిగిస్తూ కురిసే తొలకరి జల్లలను చూసి పులకరించిన మనసు ఉండదు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా పుడమి తల్లి తడుస్తుంటే.. ఆ చల్లదనాన్ని హాయిని అనుభవిస్తారు. అయితే ఈ వానల్లో చాలా రకాల వానలున్నాయట. అవి కురిసే తీరుని బట్టి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 రకాల వానలున్నాయి. ఆ వానలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Rain Names: వర్షాలకు పేర్లు ఉన్నాయని తెలుసా..! కురిసే విధానం, సమయాన్ని బట్టి వానల్ని ఏఏ పేర్లతో పిలుస్తారంటే...
Rain Names
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 4:34 PM

Share

సమస్త జీవాలకు వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రకృతి పరవశించి తొలకరి జల్లులు పడుతుంటే.. పుడమి పులకరిస్తుంది. తొలకరి చినుకుల రాకతో నెమలి పురివిప్పి నాట్యం చేస్తే.. చాతక పక్షి గొంతు తడుపుకునేందుకు ఆరాట పడుతుంది. పిల్లలు వానవాన వల్లప్ప అంటూ తొలకరి జల్లుల్లో తడిచి పులకరిస్తారు. మట్టి నుంచి వచ్చే కమ్మని వాసనని ఆఘ్రానిస్తారు. తొలకరి జల్లులకు పులకరించే మనసు.. ఉరుముల మెరుపులతో వానలు కురిస్తే భయపడుతుంది. తుఫాన్ అంటే చాలు జాగ్రత్త పడుతుంది. నైరుతి ఋతుపవనా రాగం.. ఈ శాన్య ఋతు పవనాల గానం రైతన్నలను మురిపిస్తాయి. హలం పట్టి పొలం దున్నడానికి రెడీ అవుతారు. అయితే వాతావరణ మార్పులతో అల్పపీడన ద్రోణి, వాయుగుండం, తుఫాన్ వంటి వర్షాలు కురుస్తాయి అని తెలుసు.. వాస్తవానికి వానలు ఎన్ని రాకలో తెలుసా.. కురిసే తీరుని బట్టి.. సమయాన్ని.. బట్టి.. వనాలకు రాకరకాల పేర్లు ఉన్నాయి. అవును వానల్లో ఒకటి కాదు రెండు కాదు సుమారు 25రకాల వానలున్నాయి. ఈ రోజు వానల పేర్లు ఏమిటో తెలుసుకుందాం..

వాన పేర్లు.. రకాలు..

  1. గాంధారివాన: వర్షం కురుస్తుంటే కంటికి ఎదురుగా ఉన్నది.. అంటే ఎదురుగా చెట్లు, వస్తువులు కనిపించనంతగా జోరుగా వాన కురిస్తే దానిని గాంధారివాన అంటారు.
  2. మాపుసారి వాన: రోజంతా ఎండ కాసి.. హటాత్తుగా సాయంత్రం కురిసే వానను మాపుసారి వాన అంటారు.
  3. మీసర వాన: మృగశిర కార్తెలో కురిసే వానను మీసర వాన అంటారు.
  4. దుబ్బురు వాన: తుప్పర.. తుంపరగా( పెద్ద పెద్ద చినుకు చినుకులుగా) కురిసే వర్షాన్ని దుబ్బురు వాన అంటారు.
  5.  సూరునీళ్ల వాన: ఇంటి చూరు నుంచి ధారగా నీరు పడేలా వర్షం కురిస్తే ఆ వర్షాన్ని సూరునీళ్ల వాన అని అంటారు.
  6. బట్టదడుపు వాన: వేసుకున్న బట్టలు తడిపేంతగా వర్షం కురిస్తే ఆ వానని బట్టదడుపు వాన అంటారు.
  7. సానిపి వాన : ఇంటి ముందు వాకిలి పై అలుకు (కళ్లాపి) జల్లిన విధంగా చినుకులు పడితే ఆ వానను సానిపి వాన అంటారు.
  8.  తెప్పె వాన : హటాత్తుగా ఒక ప్రదేశంలో ఒక చిన్న మేఘం నుంచి వర్షం కురిస్తే ఆ వానని తెప్పెవాన అంటారు.
  9. సాలు వాన – రైతులు వ్యవసాయం మొదలు పెట్టేందుకు ఒక నాగలిసాలుకు సరిపడా వర్షం కురిస్తే దానిని సాలు వాన అంటారు.
  10. . ఇరువాలు వాన : రైతులు వ్యవసాయం మొదలు పెట్టేందుకు వీలుగా రెండు సాల్లకు సరిపడా అంటే.. విత్తనాలు వేసేందుకు వాన కురిస్తే అది ఇరువాలు వాన అంటారు.
  11.  మడికట్టు వాన: పొలాన్ని దున్నడానికి ముందు.. బురదపెరుకునేంత జోరుగా వర్షం కురిస్తే దానిని డికట్టు వాన అంటారు.
  12. ముంతపోత వాన: ముంత( చిన్న పాత్ర) తోటి నీరు పోసినట్లు.. వాన కురిస్తే దానిని ముంతపోత వాన అంటారు.
  13.  కుండపోత వాన: కుండతో నీరు కుమ్మరించినంతగా.. అంటే ఎకధాటిగా వర్షం కురిస్తే దానిని కుండపోత వాన అంటారు.
  14.  ముసురు వాన: వరసగా నాలుగు ఐదు రోజులు పాటు విడిచి పెట్టకుండా వర్షాలు కురిస్తే దానిని ముసురు వాన అంటారు.
  15.  దరోదరి వాన: గంటలు లేదా రోజులు విరామం లేకుండా అంటే ఎడతెగకుండా కురిసే వర్షాన్ని దరోదని వాన అంటారు.
  16. బొయ్యబొయ్య గొట్టే వాన: హోరు గాలి.. గాలి ధూమము ధూళితో కురిసే వానని బొయ్యబొయ్య గొట్టే వర్షం అని అంటారు.
  17. రాళ్ల వాన :అకస్మాత్తుగా ఓవైపు ఎండ మరోవైపు వర్షం కురుస్తూ.. ఐస్ ముక్కలు పడితే.. దానిని రాళ్ల వాన లేక వడగండ్ల వాన అంటారు.
  18.  కప్పదాటు వాన: అక్కడక్కడా కొంచెం కొంచెంగా పెద్ద పెద్ద చినుకులు పడితే దానిని కప్పదాటుడు వాన అంటారు.
  19.  తప్పడ తప్పడ వాన: ఒక్కసారిగా టపటపా పెద్ద పెద్ద చినుకులు పడితే దానిని తప్పడ తప్పడ వాన అని అంటారు.
  20. దొంగ వాన: రాత్రి అంతా కుంభ వృష్టిగా వర్షం కురిసి తెల్లవారే సరికి చినుకు కూడా పడకపోతే అటువంటి వానని దొంగవాన అని అంటారు.
  21. కోపులు నిండే వాన: చిన్న చిన్న గుంతలు నిండేలా వర్షం కురిస్తే అటువంటి వానని కోపులు నిండే వాన అని అంటారు.
  22. ఏక్దార వాన: వర్షం కురవడం మొదలు పెట్టి.. ఎక్కడా విరామం లేకుండా ఏకధారగా కురిస్తే అటువంటి వానను ఏక్ధార వాన అని అంటారు.
  23. మొదటి వాన: అన్నదాత విత్తనాలు నాటిన తర్వాత.. విత్తులు మొలకెత్తెందుకు బలం ఇచ్చే విధంగా కురిసే వానని మొదటి వాన అని అంటారు.
  24. సాలేటి వాన: పుడమి తల్లిని పూర్తిగా తడిపెలా వర్షం కురిస్తే అటువంటి వర్షాన్ని సాలేటివాన అంటారు.
  25. సాలుపెట్టు వాన: భూమిని దున్నేందుకు సరిపోయెంతగా వర్షం కురిస్తే అటువంటి వానని సాలుపెట్టు వాన అంటారు.
ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..