AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పాలు త్వరగా విరిగిపోతాయి.. అప్పుడు ఏం చేయాలో తెలుసా..?

ఎండాకాలంలో పాలను సురక్షితంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. వేడి వాతావరణం కారణంగా పాలు త్వరగా పాడవుతాయి. కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే పాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. కాచే విధానం, నిల్వ చేసే పద్ధతిలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయవచ్చు.

వేసవిలో పాలు త్వరగా విరిగిపోతాయి.. అప్పుడు ఏం చేయాలో తెలుసా..?
Milk
Prashanthi V
|

Updated on: May 01, 2025 | 4:43 PM

Share

ఎండాకాలంలో పాలు త్వరగా పాడవుతాయి. వేడి గాలులు కారణంగా పాలు 1-2 రోజుల్లోనే విరిగిపోతాయి. పాలు కాచకుండా ఉంచితే అందులో బాక్టీరియా పెరుగుతుంది. అవి పాలను పాడు చేస్తాయి. దీని వల్ల పాలు వాసన వస్తాయి. రుచి కూడా మారిపోతుంది. పాలను కాచే ముందు ఉపయోగించే పాత్ర పూర్తిగా శుభ్రంగా ఉండాలి. పాలలో మురికి లేదా పాత పాలు ఉండటం వల్ల అవి త్వరగా పాడవుతాయి. పాలను కాచే ముందు పాత్రను ఉప్పుతో లేదా వేడి నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే పాలను ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు.

పాలు ఒకసారి కాచినంత మాత్రాన పాడైపోవడం ఆగదు. వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో పాలను రోజుకు 3 నుంచి 4 సార్లు కాచాలి. ఇలా చేస్తే బాక్టీరియా పెరగకుండా నిరోధించవచ్చు. ప్రతిసారి కాచిన తర్వాత గరిటె పెట్టకుండా వాడాల్సినంత పాలను వేరుగా తీసుకోవాలి.

పాలు కాచిన వెంటనే మూత పెట్టడం తప్పు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో పాలు ఆవిరి రూపంలో మారతాయి. వెంటనే మూత పెడితే ఆవిరి అందులోనే నిలిచి పాలను పాడు చేస్తుంది. కాబట్టి పాలు పూర్తిగా చల్లారే వరకు ఆగి ఆ తర్వాత మూత పెట్టాలి.

పాలను కాచుతున్నప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేస్తే పాలు విరిగిపోవు. ఇది పాలను కొంతకాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే బేకింగ్ సోడా ఎక్కువగా వేయకూడదు. మోతాదు కచ్చితంగా ఉండాలి.

పాత పాలను కాచేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇది పాల విరుగుదలను నివారిస్తుంది. పాలు మరింత మృదువుగా కూడా తయారవుతాయి. ఇది ఇంట్లో ప్రయత్నించడానికి తేలికైన పద్ధతి.

పాలను కాచిన తర్వాత వెంటనే చల్లార్చాలి. అలా చేయకపోతే వేడి కారణంగా అవి త్వరగా పాడవుతాయి. చల్లార్చే సమయంలో ఫ్యాన్ ముందు పెట్టొచ్చు లేదా నీటిలో పెట్టినా బాగుంటుంది. తర్వాత వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచాలి.

పాలను ఫ్రిడ్జ్‌లో ఉంచేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. టమాటా, నిమ్మకాయ, ఉల్లిపాయ వంటి పదార్థాల దగ్గర పెట్టొద్దు. ఇవి పాలను త్వరగా పాడు చేస్తాయి. పాల కోసం ప్రత్యేకంగా ఒక డబ్బా లేదా గిన్నె వాడాలి. మూత బాగా అమర్చినట్లుగా ఉండాలి.

పాలు ఎండాకాలంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ సూచనలు పాటించడం తప్పనిసరి. కాచే విధానం, మూత పెట్టే సమయం, ఫ్రిడ్జ్‌లో ఉంచే తీరు ఇలా ప్రతిదాని మీద శ్రద్ధ అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలతో పాలు పాడవ్వకుండా కాపాడుకోవచ్చు.