బంగారమే కాదు.. వెండిపై కూడా మోసం..! నకిలీ వెండిని గుర్తించడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
వెండి ఆభరణాలు తక్కువ ధరతో ఎక్కువ అందాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టపడతారు. అయితే మార్కెట్లో నకిలీ వెండి కూడా చాలా ఉంది. మీ వెండి ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి మీరు ఇంట్లోనే కొన్ని సింపుల్ టెస్ట్ లు చేయొచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మోసపోకుండా ఉండొచ్చు.

బంగారంతో పోలిస్తే తక్కువ ధర, ఎక్కువ స్టైలిష్ లుక్ కారణంగా వెండి ఆభరణాలను చాలా మంది ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో అన్ని వెండి వస్తువులు నిజమైనవి కావు. మీ వెండి ఆభరణం ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన పరీక్షల గురించి చెబుతున్నారు. అవేంటో.. ఎలా పరీక్ష చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హాల్‌మార్క్
నిజమైన వెండి ఆభరణాలపై దాని స్వచ్ఛతను తెలిపే ముద్ర ఉంటుంది. 925 అనే నెంబర్ ఉంటే అది 92.5 శాతం స్వచ్ఛమైన వెండి.. మిగిలినది ఇతర లోహాల మిశ్రమం అని అర్థం. దీన్నే స్టెర్లింగ్ సిల్వర్ అంటారు. కొన్నిసార్లు SS లేదా Sterling అని కూడా ముద్రిస్తారు. 999 ముద్ర ఉంటే అది 99.9 శాతం స్వచ్ఛమైన వెండి. ఈ మార్కులు ఉంగరం లోపల, గొలుసు కొక్కెం దగ్గర లేదా పెండెంట్ వెనుక భాగంలో ఉంటాయి.
ఐస్ క్యూబ్ టెస్ట్
వెండి వేడిని త్వరగా గ్రహిస్తుంది. బదిలీ చేస్తుంది. ఒక ఐస్ క్యూబ్ ను వెండి వస్తువుపై పెట్టండి. అది త్వరగా కరుగుతుంటే అది నిజమైన వెండి కావొచ్చు. ఇదే సమయంలో మరొక మామూలు లోహపు వస్తువుపై ఐస్ పెట్టి రెండింటి మధ్య తేడాను గమనించండి.
అయస్కాంత పరీక్ష
నిజమైన వెండికి అయస్కాంతం అస్సలు అంటుకోదు. ఒక బలమైన అయస్కాంతాన్ని మీ వెండి ఆభరణం దగ్గరకు తీసుకెళ్లండి. అది అంటుకుంటే అందులో ఇతర లోహాలు కలిపారని లేదా అది పూర్తిగా నకిలీ అని అర్థం. అయితే కొన్ని నకిలీ లోహాలు కూడా అయస్కాంతానికి అంటుకోవు.. కాబట్టి ఈ టెస్ట్‌తో పాటు ఇతర టెస్ట్‌లు కూడా చేయాలి.
బట్టతో రుద్దండి
ఒక మెత్తటి తెల్లని బట్టతో వెండి వస్తువును మెల్లగా రుద్దండి. నిజమైన వెండి అయితే బట్టపై నల్లటి లేదా బూడిద రంగు మరకలు పడతాయి. వెండి గాలిలోని సల్ఫర్ తో కలిసి నల్లబడటం వల్ల ఈ మరకలు ఏర్పడతాయి.
సౌండ్ టెస్ట్
నిజమైన వెండి వస్తువును మెల్లగా కొట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన స్పష్టమైన రింగింగ్ సౌండ్ వస్తుంది. అదే నకిలీ లేదా తక్కువ నాణ్యత గల లోహం అయితే త్వరగా ఆగిపోయే సాధారణ శబ్దం వస్తుంది.
బరువు
నిజమైన వెండి ఇతర లోహాల కంటే బరువుగా ఉంటుంది. మీ చేతిలో ఉన్న వెండి వస్తువు దాని పరిమాణానికి తగ్గట్టుగా బరువుగా అనిపిస్తే అది నిజమైనది అయ్యే అవకాశం ఎక్కువ.
కెమికల్ టెస్ట్
మీకు నమ్మకం లేకపోతే వెండిని పరీక్షించడానికి మార్కెట్లో ప్రత్యేకమైన కెమికల్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్స్ ఉపయోగించి వెండి స్వచ్ఛతను కచ్చితంగా తెలుసుకోవచ్చు.
ఈ చిట్కాలు మీ వెండి నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఎక్కువ ఖరీదైన ఆభరణాలు కొనేటప్పుడు తప్పకుండా వాటికి హాల్‌మార్క్ లేదా సర్టిఫికేషన్ ఉందో లేదో చూసుకోవడం మంచిది.




